హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మికసంఘాల జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే తెలంగాణలోని 9 జిల్లాలలోమాత్రం సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం హైదరాబాద్లోని పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచి జిల్లాలలో పెంచకపోవటం దారుణమని జేఏసీ విమర్శించింది. జిల్లాలలోకూడా జీతాలు పెంచి ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేసింది. వారికికూడా జీతాలు పెంచేవరకు అండగా ఉంటామని ప్రకటించింది. మరోవైపు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి జీతాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారిపై కేసీఆర్ హామీల జల్లు కురిపించారు. నగరం మధ్యలో వారికి ఇళ్ళు కట్టిస్తామని ప్రకటించారు. తెలంగాణలో మున్సిపల్ కార్మికులు సమ్మె మొదలుపెట్టి 12రోజులయింది.
ఇక ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది రోజులుగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ కార్మికుల ప్రతినిధులు విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వినతిపత్రం సమర్పిస్తే, ప్రస్తుతం డబ్బులు లేవని, తర్వాత చూద్దామని ఆయన బదులివ్వటంతో కార్మికులు మండిపడుతున్నారు. సమ్మెను ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఉదయం కార్మికులు సీఎమ్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.