గోదావరి పుష్కరాలపై డాక్యుమెంటరీ నిర్మాణం కోసం నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కు రాష్ట్రప్రభుత్వం చెల్లించేది కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమేనని, కొన్ని పత్రికలు టివిలలో వచ్చినట్టు, కొందరు రాజకీయవేత్తలు మాట్లాడుతున్నట్టు 7 కోట్ల రూపాయలు కానే కాదని, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. కొద్దిసెపటి క్రితం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పరు.
రెండోరోజునుంచీ ఈ విషయం ప్రచారం లో వుండగా ఖండించడానికి ఆరో రోజువరకూ వ్యవధి అవసరమా అన్న ప్రశ్నకు ”బ్లాగులలో ప్రచారం జరిగి వుంటే దానిపై కూడా స్పందించలేము కదా! నిన్ననే పత్రికలలో చూశాను”అన్నారు.
అన్ని న్యూస్ కెమేరాల మాదిరిగానే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కెమేరా కూడా షూటింగ్ చేసుకుంది. అందుకోసమే ప్రజల్ని క్యూలలో వేచివుండేలా చేశారన్నది వాస్తవం కాదు. అదే నిజమైవుంటే ఇతర టివిల వీడియోగ్రాఫర్లకు, ఫొటోగ్రాఫర్లకు, రిపోర్టరలకు తెలిసి వుండేదే కదా అన్నారు. రాజకీయదురుద్దేశాలతో ఇలాంటి నిందలు వేసేవారు నోరు అదుపు చేసుకోవాలి అని తీవ్రస్వరంతో హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ విశిష్టతనీ, గోదావరి పుష్కరాలశోభనీ ప్రపంచవ్యాప్తం చేయడానికి నేషనల్ జియోగా్రఫిక్ చానల్ కు డాక్యుమెంటరీ నిర్మాణాన్ని అప్పగించామన్నారు. ఈ 60 లక్షల రూపాయల ప్రాజెక్టులో 30 లక్షలు ప్రోడక్షన్ ఖర్చని, మిగిలింది మార్కెటింగ్, డిజిటలైజేషన్ వగైరా ఖర్చు అని పరకాల వివరించారు.
ఏమాత్రం తీరిక లేని సినీ దర్శకుడు బోయపాటి శీను ముఖ్యమంత్రి ఆహ్వానం మీద గోదావరి హారతి వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దడానికి వచ్చారని మరో ప్రశ్నకు సమాధానంగా పరకాల చెప్పారు. ముందురోజు హారతి కార్యక్రమం లో బేక్ గ్రౌండ్ ఆకరషణీయంగా లేకపోవడం వల్ల మార్పులకోసం ఆయన్ని పిలిపించారని, పని అయ్యాక మరుసటి రోజు నదీస్నానం చేసి వెళ్ళిపోయారని, సంఘటన జరిగిన రోజు బోయపాటి షూటింగేమీ చేయలేదని వివరించారు.