తెలంగాణ శాసన మండలి రద్దు కాబోతుందా? నిబంధనల ప్రకారం తెలంగాణలో మండలి కొనసాగింపు సాధ్యం కాదా..? అంటే అవుననే అవుననే సమాధానం వస్తోంది.
రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ రాజకీయ నాయకులు గోనె ప్రకాష్ రావు. ఏదేని రాష్ట్రంలో మండలి ఉండాలంటే 120మంది ఎమ్మెల్యేలు ఉండాలని, కానీ తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై తాను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించిన ఆయన.. కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని స్పష్టం చేశారు. నిబంధనల ఆధారంగా చూస్తే తెలంగాణలో మండలి రద్దు కావడం ఖాయమన్నారు.
Also Read : రేవంత్ ఇన్విజిలేషన్.. కేసీఆర్ పాస్ అవుతాడా?
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన గోనె తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కూడా స్పందించారు. కాంగ్రెస్ లోకి కొనసాగుతోన్న వలసలు హస్తం పార్టీకి చేటు తెస్తాయని వ్యాఖ్యానించారు. ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పెడుతుందని జోస్యం చేశారు. 2/3చేరికలు ఉంటేనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని అలా జరగకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
గత కొద్ది కాలంగా రాజకీయ అంశాలపై స్పందించకుండా సైలెంట్ గా ఉన్న గోనె తెలంగాణలో మండలి రద్దు కాబోతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. అసలెందుకు ఆయన మండలి రద్దు అంశాన్ని అనూహ్యంగా తెరమీదకు తీసుకొచ్చారు..? గోనె వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా..? అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.