ఏపీ అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ సాధించిన వైసీపీ.. మండలిలోనూ.. బలం పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్సీలు కూడా పోటి చేశారు. టీడీపీ తరుపున ప్రకాశం జిల్లా స్ధానికసంస్ధల నుంచి గెలుపొందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీ తరుపున ఒంగోలు లోక్ సభనియోజకవర్గం నుంచిపోటీ చేసి గెలుపొందారు. అలాగే అనంతపురం జిల్లా స్ధానిక సంస్ధల నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్సీగా గెలుపొందిన పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి విజయంసాధించారు. దీంతో ఆయన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.
ఇక ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరుపున ఎన్నికైన కరణం బలరామకృష్ణమూర్తి కూడా చీరాల శాసనసభ్యుడిగా గెలుపొందారు ఆయన కూడా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసిపికి చెందిన శాసనమండలి సభ్యులు ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ ఏలూరు నుంచి, కోలగట్ల వీరభద్ర స్వామిలు విజయనగరం నుంచి విజయం సాధించారు. వీళ్ళిద్దరు కూడా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. దీంతో శాసనమండలిలో అయిదు ఎమ్మెల్సీ పదవులకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.
శాసనసభలో భారీ మెజార్టీ సాధించిన వైసిపికే అయిదు ఎమ్మెల్సీపదవులు లభించనున్నాయి. ఎపి అసెంబ్లీలో 151 అసెంబ్లీ లో తెలుగుదేశంపార్టీ బలం 31 నుంచి 29కితగ్గనుండగా వైఎస్సార్ సీపీ బలం 8 నుంచి 11 కు పెరగనుంది. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులకోసం ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ పదుల సంఖ్యలో నేతలకు..ఎమ్మెల్సీ పదవుల హామీ ఇచ్చారు. వారికి సర్దుబాటు చేయడం.. కత్తిమీద సాము లాంటిదే..!