ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన మహనీయులకు డూడుల్ తో నివాళి అర్పంచడం గూగుల్ కు ఆనవాయితీ. అలనాటి ఫ్రెంచ్ రచయిత చార్లెస్ పెరాల్ట్ జయంతి సందర్భంగా డూడుల్ తో ఆయన్ని గూగుల్ గౌరవించింది. కానీ, స్వామి వివేకానందను విస్మరించింది. 1863 జనవరి 12న జన్మించిన స్వామి వివేకానంద యావత్ ప్రపంచానికి పంచిన స్ఫూర్తి అనితర సాధ్యం. పైగా, 125 కోట్ల మంది భారతీయులకు చిర స్మరణీయుడు. గూగుల్ వ్యాపార పరంగా చూసినా ఫ్రాన్స్ కంటే భారత్ లోనే ఆదాయం ఎక్కువ. మన వాడైన సుందర్ పిచాయ్ గూగుల్ సి.ఇ.ఒ. అయ్యాడని భారతీయులు గర్వించారు. కానీ, స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఒక డూడుల్ తో ఆయన్ని గౌరవించాలనే విషయాన్ని గూగుల్ పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రపంచంలో కొన్ని కోట్ల మంది యోగా చేస్తున్నారు. అమెరికాలో దాదాపు సగం మందికి యోగా తెలుసు. అలాంటి వారందరికీ స్వామి వివేకానంద గురించి తెలుసు. చార్లెస్ పెరాల్డ్ ఎవరనేది ఫ్రాన్స్ బయట తెలిసిన వారు చాలా అరుదు. పాశ్చాత్యులకు పాశ్చాత్య ప్రముఖులు తప్ప, భారతీయ స్ఫూర్తిప్రదాతలు పెద్దగా గుర్తుకు రారని మరోసారి రుజువైంది.
హిందూత్వమంటే ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. వేదాంతాన్ని, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందీ ఆయనే. అగ్రరాజ్యం అమెరికా సైతం ఆయన ప్రతిభకు నీరాజనాలు పట్టింది. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగానికి జేజేలు పలికింది. హిందూ ధర్మం గురించి, హిందువుల సంస్కారం గురించి ఆయన వివరించిన తీరుకు షికాగో సర్వమత సమ్మేళనం అబ్బుర పడింది. భారత దేశం పరాయి పాలనలో ఉన్న కాలంలోనే, ఈ నేల గొప్పతనాన్ని పాశ్చాత్య దేశాలకు వివరించాడు వివేకానందుడు. యువతకు వివేకానందుడి స్థాయిలో స్ఫూర్తినిచ్చిన వారు బహుశా ఇంకెవరూ లేరేమో. వివేకానందుడి ప్రతి మాటా ఓ పర్సనాలిటీ డెవలప్ మెంట్ పాఠం. ఇప్పటికీ ఆయన బోధనలు ఎందరినో ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఎంతో మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలనూ ఆయన ప్రభావితం చేశారు. అంతటి మహనీయుడి జయంతిని గూగుల్ వంటి మహా సంస్థ మర్చిపోవడమే ఆశ్చర్యకరం.