రియో ఒలింపిక్ క్రీడలలో పివి సింధు ఫైనల్స్ కి చేరుకొని భారత్ కి వెండి పతకం ఖరారు చేయగానే ఆమె ఆంధ్రాకి చెందిన అమ్మాయి అంటే కాదు తెలంగాణా బిడ్డ అంటూ పనికిమాలిన వాదోపవాదాలు జరిగాయి. అందుకు కారణం ఆమె తల్లి ఆంధ్రా, తండ్రి తెలంగాణాకి చెందినవారు కావడం ఆమె హైదరాబాద్ లో పుట్టి పెరగడమే. చివరికి కొందరు ఆమె తమ కులానికే చెందిందని గొప్పగా చెప్పుకొన్నవారు కూడా ఉన్నారు. ఆమె రియో ఒలింపిక్ క్రీడలలో భారత్ ప్రతినిధిగా హాజరయ్యింది తప్ప ఆంధ్రా లేదా తెలంగాణా రాష్ట్రాల తరపునో లేదా ఒక కులం తరపునో హాజరు కాలేదనే సంగతి అందరికీ తెలుసు కానీ ఆమె సాధించిన విజయాన్ని స్వంతం చేసుకోవాలనే పేరాశతోనే ఆవిదంగా తెలివి తక్కువగా వాదోపవాదాలు చేసుకొని నవ్వులపాలయ్యారు.
రియో ఒలింపిక్స్ లో నిషేదానికి గురైన నర్శింగ్ యాదవ్ ని ఎవరూ, ఏ రాష్ట్రం కూడా క్లెయిం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కనీసం అతనికి సానుభూతి తెలిపేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. కారణం దాని వలన తమకి కూడా అప్రదిష్ట కలుగుతుందేమోననే భయం కావచ్చు లేదా అటువంటి వ్యక్తి వలన తమకి రాజకీయంగా ఉపయోగం ఉండదనే కారణం కావచ్చు. కానీ ఒకవేళ గెలిచి ఉండి ఉంటే అతని కోసం కూడా అందరూ ఇదేవిధంగా పోటీలు పడేవారేమో?
సింధూ స్థానికతపై జరిగిన వాదోపవాదాల గురించి తెలుసుకొన్న ఆమె కోచ్ గోపీ చంద్ సమాధానం చెపుతూ “ఆమె యావత్ భారత్ కి చెందిన వ్యక్తి. ఆమె విజయం యావత్ భారత్ స్వంతం” అని అన్నారు. అది నిజం కూడా. ఆమెలో చాలా పోరాట పటిమ దాగి ఉందని 2020 జపాన్ లో జరుగబోయే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించే విధంగా ఆమెకి ఇప్పటి నుంచే మంచి శిక్షణ ఇస్తానని గోపీ చంద్ చెప్పారు. ఆమె కూడా వచ్చే ఒలింపిక్ పోటీలలో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని చెప్పారు.