శ్రీనువైట్ల సినిమాలంటేనే వినోదానికి కేరాఫ్ అడ్రస్స్. ఆయన ఎలాంటి కథ ఎంచుకొన్నా, అందులో కామెడీని మిక్స్ చేసేస్తారు. శ్రీనువైట్ల సినిమాల్లో కామెడీ ట్రాకులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ‘వెంకీ’లో ట్రైన్ ఎపిసోడ్ ఇప్పటికీ నవ్వులు పంచుతూనే ఉంటుంది. అలాంటి ఎపిసోడ్ ఇప్పటి వరకూ మళ్లీ ఎవరూ రీ క్రియేట్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు శ్రీనువైట్లనే తన ట్రైన్ ఎపిసోడ్‌కు ధీటుగా మరో ఎక్స్‌ప్రెస్ కామెడీ సీక్వెన్స్‌తో రాబోతున్నారు. ‘విశ్వం’తో.
గోపీచంద్ – శ్రీనువైట్ల కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘విశ్వం’. ఈ సినిమాలో ఈ హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ డిజైన్ చేశారు శ్రీనువైట్ల. అది ‘వెంకీ’ని మించిపోయేలా నవ్వులు పంచుతుందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. ”ఈసారి నో వెయిటింగ్ లిస్ట్.. నో ఆర్.ఏ.సీ.. ఎంటర్టైన్మెంట్ కన్ఫామ్” అని చెబుతూ ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. అందులో ట్రైన్ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్స్ కూడా చూపించారు. అవి చూస్తుంటే ఈసారి శ్రీనువైట్ల ‘వెంకీ’ మ్యాజిక్ రిపీట్ చేసినట్టే అనిపిస్తోంది. ఎక్కువ శాతం విదేశాల్లో షూటింగ్ చేసిన సినిమా ఇది. ఆ విజువల్స్ కూడా బాగున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు. శ్రీనువైట్లతో పాటుగా గోపీచంద్ కు కూడా ఈసారి హిట్టు కొట్టడం చాలా అవసరం. మరి… ఈ కాంబో ఏం చేస్తుందో?