” న్యూడిస్ట్” మాధవ్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చర్చ ప్రారంభమయింది. అదేమిటంటే… ఇంత దారుణమైన క్యారెక్టర్ ఉన్న గోరంట్ల మాధవ్‌ను చట్టసభలకు పంపిన ప్రజలకు.. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా సుదీర్ఘ కాలం ఐపీఎస్ సర్వీస్‌లో ఉన్న లక్ష్మినారాయణను ఓడించారు. ఇదే ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నారు. వెంటనే విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చుని సభను నడిపారు. ఇది కూడా ప్రజాస్వామ్యమే అని చెప్పుకున్నారు. కానీ ప్రజాస్వామ్య గొప్పదనం అని చెప్పుకోవడం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం అని నిట్టూరుస్తున్నారు.
పోలీసుగానే గోరంట్ల మాధవ్ క్యారెక్టర్ బ్యాడ్ ! అయినా గెలుపు
గోరంట్ల మాధవ్ . ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దేశాన్ని పరిపాలించేందుకు చట్టాలు చేసే సభలో ఆయనో సభ్యుడు. కానీ ఆయన తీరే వివాదాస్పదం. చేసింది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు కులాలను తిట్టడం.. మరో తప్పుడు పని. ఇంత చేసి ఆయన రికార్డు ఏమైనా నిజాయితీగా ఉందంటే.. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని నీచ నికృష్ట పనులకు పాల్పడిన చరిత్ర ఉంది. సీఐగా ఉండి కూడా ఓ రేప్ కేసు.. హత్య కేసు.. అట్రాసిటీ కేసులు మోశారు. అంతేనా లాఠీ చేతులో ఉంటే ప్రజల్ని పురుగుల్ని చూసినట్లు చూసేవాడు. నోట్ల రద్దు సమయంలో ఆయన లాఠీ పట్టుకుని ప్రజల్ని బాదే దృశ్యాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంత దారుణమని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడమే ఓ విచిత్రం అనుకుంటే.. ప్రజలు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించడం ప్రజాస్వామ్యం.
నీతి నిజాయితీగా మారుపేరుగా లక్ష్మినారాయణ.. కానీ ఓటమి !
సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మినారాయణ నీతి, నిజాయితీకి మారుపేరు. ఐపీఎస్‌గా ఆయనకు ఎలాంటి రిమార్కులు లేవు. ఇక్కడ జగన్ అవినీతిని బయట పెట్టారని ఆయనపై రకరకాల ప్రచారాలు చేస్తూండవచ్చు కానీ ఆయన కడిగిన ముత్యమని అందరికీ తెలుసు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓ ప్రధాన పార్టీతరపున నిలబడినా గెలవలేకపోయారు. ప్రజలు ఆయనను గెలిపించుకోలేకపోయారు. ఇది కూడా ప్రజాస్వామ్యమే. నిజానికి అటు వ్యక్తిత్వంలోనూ.. ఇటు ప్రజాసేవ చేసే విషయంలోనూ… మాధవ్ ఓ ఓ మెట్టు మీద ఉంటే లక్ష్మి నారాయణ ఎంతో ఎత్తులో ఉంటారు. కనీసం పోల్చుకోలేం . కానీ ఓటమి మాధవ్‌ను గొప్ప వ్యక్తిని చేసింది. జేడీ ఓడిపోయాడుకాబట్టి ఆయనను కించ పరిచే పరిస్థితికి చేరింది.
రాజ్యసభ చైర్మన్ సీట్లో కనిపించిన విజయసాయి !
విజయసాయిరెడ్డి ఈ పేరు చెబితే ఆయన ట్వీట్ భాష గుర్తుకు వస్తుంది . అధికారం ఉంది కాబట్టి ఇలా ఉన్నారు లేకపోతే ఆయన వేసే ట్వీట్లకు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చెప్పలేం. పైగా ఆయనపై ఆర్థిక నేరాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తుల్లో ఆయనొకరు. అయినా రాజ్యసభ చైర్మన్ సీట్లో ఆయన కూర్చున్నారు. ఇది చాలా మంది ఆశ్చర్య పరుస్తోంది. కానీ ఇదే ప్రజాస్వామ్యం అని చెబుతున్నారు.
ఇదేనా ప్రజాస్వామ్యం.. మారక్కరలేదా ?
ఇదే ప్రజాస్వామ్యం. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్యం. చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఆచరణలో ఎలా ఉంది. క్రిమినల్స్ దేశాన్ని నడిపే పరిస్థికి వస్తోంది. క్రిమినల్స్ మైండ్ సెట్ ప్రకారం చట్టాలు మిరిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మారొద్దా..? ప్రజలు మారొద్దా ? . మార్పు లేకపోతే.. రాకపోతే.. ముందు ముందు దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ప్రజలకు అర్థమవుతోంందా ?