తెలుగుదేశం ఎంఎల్‌ఎలలో కొందరు సీనియర్లున్నారు. తమకు తగిన స్థానాలు రాలేదనే అసంతృప్తికి తోడు అధినేత చంద్రబాబు నాయుడు నిర్వాకాలతో కూడా అంతగా ఏకీభవించలేని వారిని ఈ క్యాటగరీలో చేర్చొచ్చు. అయితే పార్టీని సమర్థించడం, ప్రతిపక్షాలపై విరుచుకుపడటం తప్ప వారు ఇప్పుడు చేయగలిగింది కూడా పెద్దగా లేదు. అలాటి వారిలో ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. శాసనసభలో వైసీపీని ఢకొీనడంలో బుచ్చయ్య చౌదరి ప్రతాపం అందరూ చూస్తుంటారు.ఔ అయితే మిగిలిన కొంతమందిలా గోరంట్ల కేవలం వైసీపీకే పరిమితం కారు. తన నియోజకవర్గం రాజమండ్రిలోనూ తూర్పుగోదావరి జిల్లాలోనూ ఆయనకు బిజెపితో వైరం వుంటుంది. . అందులోనూ టిడిపిపై వీర విమర్శకుడైన బిజెపి ఎంఎల్‌సి సోము వీర్రాజు అక్కడివారే గనక ఆయనపైనా విరుచుకుపడుతుంటారు. తాజాగా ఉపాధి హామీ పథకంపై వీర్రాజు ఆరోపణలు చేయడం గోరంట్లకు బాగా కోపం తెప్పించింది. ఇప్పటికే ఈ పథకం అమలుపై వైసీపీ వారు ఫిర్యాదులు చేస్తుంటే మీరు కూడా గొంతు కలుపుతారా అని వీర్రాజుపై మండిపడ్డారు. వారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటే బిజెపి కూడా అదే పద్ధతా అని ఆగ్రహించారు. ఇంతకూ ఆరోపణలు నిజమా కాదా అని చూడాలి గాని అనడమే తప్పంటే ఎలా? పైగావైసీపీ తప్ప ఇతరులు ఆరోపణలు చేయొద్దని గోరంట్ల భావిస్తున్నారా? ఏ పథకమైనా సరిగ్గా పనిచేయాలంటే తనిఖీ పర్యవేక్షణ ఫిర్యాదులు వుండాలి కదా.. బహుశా సోము వీర్రాజు కూడా ఇందుకు తగినట్టే స్పందిస్తారనడంలో సందేహం లేదు. అయితే ఆఖరుకు ఇదంతా దాగుడుమూతల్లా ముగిసిపోవడం అనివార్యమే.