వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హిందూపురం తరపున లోక్‌సభకు పోటీ చేసే అవకాశాన్ని పొందిన .. మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌కు.. చిక్కులు తప్పడం లేదు. మూడు నెలల కిందట.. ఆయన పెట్టుకున్న స్వచ్చంద పదవీ విరమణ దరఖాస్తుకు… ఆమోదం రావడం లేదు. ఆయన దీనిపై ట్రిబ్యునల్‌కు వెళ్లి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నా… పోలీసు అధికారులు మాత్రం.. స్పందించడం లేదు. రెండు కేసులు పెండింగ్ ఉన్నాయని… పోలీసులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నోట్ల రద్దు సమయంలో… అనంతపురంలో సీఐగా ఉన్నారు. ఆ సమయంలో.. ఓ ఏటీఎం దగ్గర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని చితకబాదారు. ఆయన కోర్టుకు వెళ్లారు. దానితో పాటు మరో కేసు కూడా పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏ ఇతర అంశాలు పెండింగ్‌లో లేకపోతే.. రిలీవ్ చేస్తారని.. ఉంటే మాత్రం… వాటికి సంబంధించిన ప్రాసెస్ జరగాలని సర్వీస్ రూల్స్ చెబుతున్నాయనే వాదన తెరపైకి వస్తోంది.
మరో వైపు… ఈ అంశంపై గోరంట్ల మాధవ్… పోలీసు అధికారుల చుట్టూ తిరిగారు. రాయలసీమ ఐజీని కలిసి రిలీవ్ ఆర్డర్స్ తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. శని, ఆదివారాలు… నామినేషన్లకు సెలవులు. సోమవారంతో.. నామినేషన్ల గడువు ముగుస్తుంది. అప్పటికి రిలీవ్ ఆర్డర్స్ రాకపోతే.. నామినేషన్ తిరస్కరణకు గురవుతోంది. దాంతో.. వైసీపీ నేతలు ప్లాన్ బీ అమలు చేయడం ప్రారంభించారు. గోరంట్ల మాధవ్ భార్య సవిత పేరు మీద బీఫాం ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం కల్లా.. రిలీవ్ ఆర్డర్స్ రాకపోతే.. భార్య పేరుతో.. నామినేషన్ వేయాలని ఆయనకు జగన్ సూచించినట్లు చెబుతున్నారు.
హిందూపురం నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఆ పార్టీకి చెందిన నిమ్మల కిష్టప్ప.. వరసుగా గెలుస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోనే రాప్తాడు, హిందూపురం, పెనుకొండ లాంటి టీడీపీకి భారీ మెజార్టీ తెచ్చే… అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు.. వైసీపీ అభ్యర్థి విషయంలో గందరగోళం ఏర్పడటంతో… ఇంత వరకూ… అక్కడ ప్రచారమే చేయడం లేదు.