రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని లండన్లో అన్నారని బీజేపీ ఇక్కడ రచ్చ చేస్తోంది. దేశద్రోహం చేసేశారని కన్నీరు పెట్టేస్తోంది. మోదీ విదేశాల్లో ఎన్నో సర్లు దేశంలో గతం అంతా దరిద్రమేనని ఇప్పుడు స్వర్ణయుగం వస్తోందని చెప్పుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో మోదీ దేశాన్నికించ పరుస్తున్నారని విమర్శించారు. కానీ అదే జాతీయ సమస్యగా ఎవరూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు అదానీ వ్యవహారం కళ్ల ముందు కనిపిస్తూంటే… రాహుల్ అన్న వ్యాఖ్యలను మాత్రం బీజేపీ పెద్ద విపత్తులాగా ప్రచారం చేస్తోంది.
రాహుల్ గాంధీ ఏమీ దేశాన్ని కించపర్చకపోయినా… అలా ఓ ఉద్వేగాన్ని సృష్టించడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. జాతి సంపదతో అదానీ వంటి వారు చేస్తున్న వ్యవహారాలపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇలాంటి సమస్యలపై చర్చ జరగకుండా కేంద్రం … రాహుల్ గాంధీ ఏదో అన్నారని.. అది దేశానికి నష్టం చేస్తుందన్నట్లుగా ప్రచారోద్యమం ప్రారంభించడం.. ప్రజల్ని కించపర్చడమే. ఇప్పుడు రాహుల్ సభలపై జేపీసీ వేస్తామని బయలుదేరారు. అదా అసలు సమస్య?
ప్రజల్ని భావోద్వేగంలో ముంచే మాయ తమ దగ్గర ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే రాహుల్ గాంధీ కామెంట్లను పట్టుకుని అంతకు మించిన సమస్య లేదన్నట్లుగా చెలరేగిపోతున్నారు. . రాజకీయాల కోసం .. జాతీయత వాడుకోవడం కూడా అంతే. వాడుకున్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ ప్రతీ దానికి అదే అంశం చూపించి రాజకీయం చేస్తే… మొదటికే మోసం వస్తుంది. బీజేపీ దీన్ని ఇప్పటికీ గుర్తించడం లేదు.