గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు చేయాలని.. రేషనలైజేషన్ చేపట్టాలని ఏఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపుగా పదిహేను వేల వరకూ ఉన్న గ్రామ, వార్డు సచివాయాల్లో లక్షన్నర మంది వరకూ ఉద్యోగులున్నారు. వారేం చేస్తారో వారికే తెలియదు. కనీసం జాబ్ కార్డు కూడాలేదు. రోజా ఆఫీసుకు వచ్చి వెళ్లడమే పని . ఐదు వందల రకాల పనులు చేస్తారని ప్రభుత్వం ఉదరగొట్టింది కానీ అసలు అవేమీ అక్కడ చేయరు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తోడు వాలంటీర్లు కూడా ఉండేవారు. వాలంటీర్లతో ఇప్పుడు ఏ పనీ చేయించుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కేవలం పెన్షన్లు మాత్రమే పంపిణీ చేయిస్తున్నారు. ఇప్పుడు వారందర్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్లస్టర్ విధానం తీసుకు వచ్చి.. ఎక్కువ జనాభా ఉన్న చోట ఎక్కువ మందిని నియమించనున్నారు.
అలాగే ఈ ఉద్యోగుల్లో అర్హత ఉన్న వారిని ఇతర చోట్ల వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా పోలీసుల పేరుతో పదిహేను వేల మందిని గత ప్రభుత్వం నియమించింది. వారెవరూ అధికారికంగా పోలీసులయ్యే అవకాశం లేదు. ఈ పేరుతో కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు మొత్తం వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరంలో ప్రభుత్వం పడింది.