రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడం తోడు… గవర్నర్ పై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూండటంతో తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్అన్న పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. పుదుచ్చేరి కూడా లెఫ్టి నెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసై..తెలంగాణలో జెండా వందనం తర్వాత పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ తమిళ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. కరోనా పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. అదే కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ నిరవహించారని తమిళిసై గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటిపై కేంద్రానికి నివేదిక పంపించానని ప్రకటించారు. మరో వైపు హైదరాబాద్ రాజ్ భవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నేరుగా ప్రభుత్వం విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ ల గురించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ నేతలు.. గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవి గీత దాటుతున్నాయి.
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో పాటు.. రాజ్యాంగ పరంగా నిర్వర్తించాల్సిన విధులను ప్రభుత్వం నిర్వహించడం లేదని.. గవర్నర్ కు ప్రోటోకాల్ కూడా కల్పించడం లేదన్న ఆరోపణలు బీజేపీ వైపు నుంచి వస్తున్నయి. ఈ క్రమంమలో గవర్నర్ .. కేంద్రానికి నివేదిక పంపించానని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కేంద్రం సీరియస్గా తీసుకుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.