రియో ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన పివి సింధు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకొన్నారు. ఆమెకి తెలంగాణా ప్రభుత్వం ఘనస్వాగతం పలికేందుకు కళ్ళు చెదిరే ఏర్పాట్లు చేసింది. అందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుని రప్పించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఆమెని దానిలో ఊరేగింపుగా తీసుకువెళుతున్నారు. ఆమెతో బాటు కోచ్ పుల్లెల గోపీ చంద్ కూడా ఉన్నారు. రోడ్డు పొడవునా ప్రజలు, అభిమానులు, విద్యార్ధులు ఆమెకి స్వాగతం పలుకుతున్నారు. గచ్చి బౌలీ స్టేడియంలో కూడా ఆమెకి ఘనస్వాగతం పలకడానికి రెండు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, అనేక మంది ప్రముఖులు, క్రీడాకారులు వేచి చూస్తున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమెకి రూ.5కోట్ల నగదు బహుమానం, హైదరాబాద్ లో 1,000 గజాల స్థలం, ప్రభుత్వోద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమెకి రూ.3 కోట్లు నగదు బహుమానం, అమరావతిలో 1,000 గజాల స్థలం, గ్రూప్-1 ప్రభుత్వోద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. పుల్లెల గోపీ చంద్ కి తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షలు బహుమానంగా ఇవ్వబోతున్నాయి. అదీగాక భారత్ బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు వి. చాముండేశ్వరనాథ్ తరపున ఆమె అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఖరీదైన బి.ఎం.డబ్ల్యూ.కారుని బహుకరించబోతున్నారు.
బహుశః మరికొన్ని రోజులపాటు సింధూ, గోపీ చంద్ ఇద్దరూ ఇంకా అనేక సత్కారాలు, భారీ బహుమానాలు అందుకొంటూనే ఉండవచ్చు. ఆ తరువాత ఏమి జరుగుతుందంటే మళ్ళీ ఆమె బ్యాడ్మింటన్ శిక్షణ మొదలుపెట్టవచ్చు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ రొటీన్ రాజకీయాలలో పడిపోవచ్చు. మళ్ళీ 2020లో ఒలింపిక్స్ జరిగే వరకు క్రీడల గురించి ఎవరూ మాట్లాడకపోవచ్చు.
ఈవిధంగా ఒకే ఒక్కసారి అత్యుత్సాహం ప్రదర్శించి హడావుడి చేసి చేతులు దులుపుకొంటునందునే మన దేశం కేవలం రెండు పతకాలకే సంతోషపడుతూ పండుగ చేసుకోవలసి వస్తోంది. ఈ స్పూర్తితోనే, ఈ ఉత్సాహంతోనే దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం క్రీడాకారులకి అవసరమైన శిక్షణ, సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అనేక కష్టనష్టాలని, సమస్యలని, సవాళ్ళని ఎదుర్కొని పతకాలు సాధించిన సాక్షి మాలిక్, సింధూ ఇద్దరూ కూడా ఇదే ఊపులో ప్రభుత్వాలని అందుకు ప్రోత్సహించాలి. దేశంలో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్న నిరుపేద క్రీడాకారులకి మేలు చేకూర్చేవిధంగా నిర్దిష్టమైన హామీలు రాబట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జనాల మెప్పుకోసమైన వారిద్దరికీ బారీ బహుమానాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు పోటీలు పడుతున్నాయి కనుక దేశంలో క్రీడల అభివృద్ధికి వారి నుంచి నిర్దిష్టమైన హామీలు పొందదానికి ఇదే తగిన సమయం. వారిద్దరే అందుకు నడుం బిగించాలి. అప్పుడే వచ్చే ఒలింపిక్ క్రీడల నాటికి మనదేశంలో అనేకమంది క్రీడాకారులని తయారుచేసుకోగలుగుతాము.