దేశంలో విచిత్రమైన పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ విద్యార్హతలు అడిగినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. పాతిక వేల జరిమానా విధించించింది. దేశానికి ప్రధాని మోదీ. ఆయన ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన వాటి ప్రకారమే ఎక్కడ చదువుకున్నారో ఆధారాలు అడిగారు. సర్టిఫికెట్లు చూపించమన్నారు. ఇదే తప్పయిపోయింది గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి గారి. వెంటనే పిటిషన్ కొట్టేసి రూ. పాతిక వేలు జరిమానా వేశారు.
అయితే సూరత్ కోర్టు న్యాయమూర్తి కన్నా గుజరాత్ హైకోర్టు జడ్జి కి కాస్త విశాల హృదయం ఉన్నట్లే. ఎందుకంటే రెండేళ్ల జైలుశిక్ష వేసి ఉంటే.. కేజ్రీవాల్ ఈ పాటికి మాజీ సీఎం అయి ఉండేవారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. విద్యార్హత అడిగితే ఫైన్ వేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో న్యాయం నాలుగు పాదాలా నడుస్తోందని సెటైర్లు వేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా కోర్టుల నుంచి వెలువడుతున్న నిర్ణయాలు .. విమర్శలకు కారణం అవుతున్నాయి.
గతంలో రాజకీయ కేసుల విషయంలో న్యాయస్థానాలు కాస్త సంయమనంతో ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారిపోయింది. రాహుల్ గాంధీకి వేసిన రెండేళ్ల శిక్ష తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువ అయింది. రాహుల్ కు శిక్ష పడిన వైనం దగ్గర్నుంచి అనేక అంశాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి వ్యవస్థలకు మంచిదో కాదో ప్రజలకే తెలియాలి.