మనకున్న క్రియేటీవ్ డైరెక్టర్లలో గుణశేఖర్ ఒకడు. ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆయన నుంచే వచ్చాయి. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు బెడసి కొట్టాయి. ముఖ్యంగా ‘రుద్రమదేవి’, ‘శాకుంతలం’ బాగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకొన్నారు గుణ. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసారి ఆయన యూత్ ఫుల్ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. దానికి `యుటోపియా` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈసారి కొత్త హీరోలు, హీరోయిన్లనీ పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ‘యుటోపియా’ అంటే ఆనంద భ్రాంతి, ఆనందాతిరేకం అనే అర్థాలున్నాయి. ఈ చిత్రాన్ని గుణ తన సొంత బ్యానర్లోనే తెరకెక్కిస్తున్నారు. ‘శాకుంతలం’ తరవాత రానాతో ‘హిరణ్య కశ్యప’ తీద్దామనుకొన్నారు. అందుకోసం రెండేళ్లు కష్టపడ్డారు గుణ. అయితే చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ చేతులు మారింది. మొన్నటి వరకూ ‘హిరణ్యకశ్యప’ సినిమాని వేరే హీరోతో పట్టాలెక్కిద్దామనుకొన్నారు. ఇప్పుడు ఆయన ప్లాన్ మారింది. `యుటోపియా`కు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తారు.