ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్తి నిస్తేజం అయిపోయింది. ఒక్క సీటు గెలకపోవడం అటుంచితే కనీస పోటీ ఇచ్చిన నియోజకవర్గం కూడా లేకపోవడంతో భవిష్యత్ ఉంటుందా లేదా అన్న ఆందోళనలో నేతలు పడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కక్ష సాధింపులకు పాల్పడటంతో.. తమను వదిలే అవకాశం లేదని బిక్కు బిక్కుమని గడిపేస్తున్నారు. రోడ్లపైకి వచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదు. కనీసం మీడియా సమావేశాలు పెట్టడం లేదు. ఇంకా ఏమైనా డేంజర్ ఉంటుందనుకుంటే… పార్టీకి రాజీనామా చేసి ..ఖాళీగా ఉండేందుకు రెడీ అయిపోతున్నారు.
వినుకొండలో శవరాజకీయం కోసం వెళ్లినప్పుడు జగన్ వెంట సీనియర్ నేతలెవరూ లేరు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇతర చోటామోటా నేతలు ఆయన వెంట ఉన్నారు. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు అత్యధిక మంది కనిపించలేదు. మద్దాళి గిరి, కిలారు రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోనూ ఎంట్రీ లేకపోయినా వైసీపీలో ఉండటం కన్నా ఖాళీగా ఉండటం ఉత్తమమని ఊరుకున్నారు. తన పదవి తనకు ఉంచితే టీడీపీలోకి వస్తానని గుంటూరు మేయర్ కబురు పెట్టారు. కానీ టీడీపీ పట్టించుకోలేదు.
గుంటూరు వైసీపీ కి ఇప్పుడు అధ్యక్షుడు కూడా లేరు. ఎన్నికలకు ముందు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. అప్పిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ గుంటూరులో ఆయన కు ఉన్న ఇమేజ్.. ఆయనకు ఉన్న రాజకీయ బలం చాలా స్వల్పం. వైసీపీ స్థాయి ఆయనది కానీ.. ప్రజల్లో మాత్రం ఆయన నెగెటివ్వే. పలుకుబడి ఉన్న నేతలంతా .. వచ్చే రెండు, మూడు నెలల్లో పార్టీ మారిపోతారని చెబుతున్నారు. ఈ ప్రకారం చూస్తే.. వచ్చే కొద్ది రోజుల్లో గుంటూరు వైసీపీ ఉనికి సమస్యల్లో పడే అవకాశం ఉంది.