ఇంకా ఈ వ్యవహారంలోకి ఆయన ఎందుకు రాలేదా అనే చిన్నలోటు ఉండేది..! హమ్మయ్య… మొత్తానికి, ఇప్పుడు ఆయన కూడా వచ్చేశారు. ప్రెస్ మీట్ పెట్టేశారు. అదేనండీ… బీజీపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు! ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి… ఆంధ్రా రాజకీయాలపై మాట్లాడారు. డాటా చోరీ వ్యవహారంపై భగ్గుమన్నారు..! సమాచారం చోరీ కావడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టే లెక్క అని తీర్మానించేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డాటాను ప్రైవేటు సంస్థలకు ఎలా ఇస్తారంటూ జీవీఎల్ ప్రశ్నించారు? అంతేనా… ఈ కేసుపై ఆయనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు స్పందిస్తూ, ఈ చోరీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయట పడుతున్నారంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న డాటా చోరీ వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలనీ, వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన వ్యవహారం కాదనీ, ప్రజల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కీలకమైన అంశమని జీవీఎల్ వివరించారు. తప్పులన్నీ వారే చేసేసి, వేరేవారికి ఆపాదించడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయిందన్నారు!
జీవీఎల్ దృష్టిలో ఈ అంశం జాతీయ స్థాయి సమస్య అనే రేంజిలో ఉంది! ప్రజాస్వామ్యం ఖూనీ చేయడమేనట. ఇంతకీ, ఏం ఖూనీ జరిగిందీ, ఎక్కడ జరిగిందీ, ఎవరికి నష్టం వాటిల్లింది… ఇదేదో చెప్తేనే కదా ఏం జరిగిందో అర్థమౌతుంది. ప్రజలకు సంబంధించిన డాటాను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం తప్పా? ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పనులను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నప్పుడు, డాటా ఇవ్వరా? భాజపాకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ పార్టీ వేరే సంస్థలకు ఇవ్వకుండానే స్వయంగానే నడిపించుకుంటోందా. ఈ విషయాలపై కూడా జీవీఎల్ మాట్లాడితే, ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలకు కొంతైనా బలం ఉండేది. ఇంకోటి… ఈ చోరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దోషిగా తేలుతున్నారని చెప్పడానికి ఈయన ఎవరు? ఇలాంటి అభిప్రాయాలు వెల్లడించడం వెనక ఆయన ఉద్దేశమేంటి?
వారు చేసిన తప్పులకు, ఇతర పార్టీలపై నెపాన్ని నెట్టేయడం టీడీపీకి అలవాటు అన్నారు కదా! వేరే పార్టీలపై టీడీపీ నెపాన్ని నెడుతుంటే, మధ్యలో జీవీఎల్ కి ఎందుకట? వైకాపా, తెరాసల తీరు మీద టీడీపీ ఆరోపిస్తోంది. మధ్యలో భాజపా ఎంపీ స్పందిస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఆ పార్టీలను వెనకేసుకొస్తున్నట్టుగా జీవీఎల్ మాట్లాడుంటే, టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఈ డాటా చోరీ వివాదానికి స్క్రిప్ట్ అంతా ఎవరిస్తున్నట్టు అనిపిస్తోంది? ఆంధ్రాలో తమకు అనుకూలంగా ఉండే పార్టీని అధికారంలోకి తేవడం కోసం, తెలంగాణలో తమకు తెరచాటు మద్దతు ఇచ్చే మరో పార్టీ ద్వారా ఏపీలో భాజపా రాజకీయం నడుపుతున్నట్టు లేదా?