అమిత్ షా విశాఖ సభలో ప్రసంగిస్తే అనువాదం చేసే బాధ్యతను జీవీఎల్ నరసింహారావుకు ఇచ్చారు. బాగా అనువాదం చేసి అమిత్ షా దగ్గర మార్కులు కొట్టేయాల్సిన జీవీఎల్… తన అభిమాన నేత, ప్రభుత్వాన్ని అమిత్ షా విమర్శిస్తున్నారని.. సొంత కవిత్వం చెప్పి ప్రజల్ని నమ్మించాలని అనుకున్నారు. తీరా చూస్తే.. ఆయన ట్రాన్స్ లేట్ చేస్తున్న తీరుపై అమిత్ షాకే డౌట్ వచ్చింది. నేరుగానే అడిగేశారు. తాను ఏం చెబుతున్నాను.. నువేం చెబుతున్నావని స్టేజీపైనే నిలదీశారు. దీంతో ఉలిక్కిపడిన జీవీఎల్ నరసింహారావు.. వినిపించడం లేదు.. రాసుకుంటానని కవర్ చేసుకుని.. ప్యాడ్, పెన్ను తీసుకుని మరింత షో చేశాడు.
బహిరంగసభలో జీవీఎల్ వ్యవహరించిన తీరు చూసి.. అసలు బీజేపీలో శత్రువులు ఎక్కడో ఉండరని.. ఆ పార్టీ నేతలేనని గుసగుసలాడుకున్నారు. జీవీఎల్ నరసింహారావు సరిగ్గా అనువదించని పార్ట్ అంతా.. అమిత్ షా జగన్ పై విమర్శలు చేస్తున్న సందర్భంలోనివే. అందుకే అందరూ ఆయన శీలాన్ని శంకించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు వైరల్ చేశారు. బీజేపీ నేతలు కూడా దీన్ని సమర్థించుకోలేకపోయారు చివరికి జీవీఎల్ ను సొంత పార్టీ నేతలే డౌట్ గా చూసే పరిస్థితి ఏర్పడింది.
సెఫాలజిస్టుగా బీజేపీ పెద్దలకు దగ్గరైన జీవీఎల్ .. రాజ్యసభ సభ్యత్వాన్ని అధికార ప్రతినిధి పదవినికూడా పొందారు. తర్వాత ఆయన టాలెంట్ బయటపడటంతో.. చివరికి అధికార పదవి నుంచి పీకేశారు. రేపు యూపీ నుంచి ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం కూడా ముగిసిపోతుంది. ఆయనకు ఇక ప్రాధాన్యం దక్కదని కంటిన్యూ చేయరని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. అందుకే ఆయన సంబంఁధం లేకపోయిన విశాఖ వచ్చి … హడావుడి చేస్తున్నారు. అక్కడ పోటీ చేయాలని ఆయన ప్లాన్. కానీ అలాంటి చాన్స్ కూడా ఉండదని నిన్నటి ట్రాన్స్ లేషన్ సీన్తో తెలిసిపోయిందన్న గుసగుసలు బీజేపీలోనే వినిపిస్తున్నాయి.