బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ జనసేన విషయంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా సూచనలు ఇస్తూనే ఉంటుంది. బీజేపీ కలిసి రావాలని ఆ పార్టీ నేతలెవరూ కోరుకోవడం లేదు. బహిరంగంగా చెప్పడం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం పదే పదే టీడీపీతో పొత్తు లేదంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. సోమ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా జీవీఎల్ లాంటి వాళ్లు..ప్రెస్ మీట్ పెడితే మొదట టీడీపీతో పొత్తు ఉండదనే మాట చెబుతున్నారు. ఎవకరూ అడగకపోయినా అదే చెబుతున్నారు.
ఇటీవల భీమవరంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశాల్లో .. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ బీజేపీ కలయికతో రావాలని తీర్మానం చేశారు. పొత్తులో ఉన్న జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని తీర్మానం చేసి ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ అధికారంలోకి వచ్చే పార్టీతో బీజేపీకి పొత్తు ఉండాలన్నట్లుగా తీర్మానం చేయడంతో .. టీడీపీతో పొత్తు కోసం ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందన్న ప్రచారం ప్రారంభమయింది. నిజానికి ఈ ప్రచారం.. ప్రో బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే జరిగింది.. ఇంకెవరూ పట్టించుకోలేదు.
కానీ ఎంపీ జీవీఎల్ మాత్రం తెరపైకి వచ్చేశారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ బిజెపి కలయికతో రావాలి అని చెప్పారు. కానీ కొందరు అప్పుడే దీనికి వక్రభాష్యాలు చెపుతున్నారని ఆరోపించారు. వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. కానీ అది టిడిపి కాదు. భ్రమలు వద్దని స్పష్టం చేశారు. మేమూ జనసేనా కలిసే ఉన్నాము. ఈ విషయాన్ని మేమూ, జనసేనా చెపుతుంటే కాదు కాదని కొందరు ప్రచారం చేయటం ఏమిటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. జీవీఎల్ తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన అలా అంటున్నారంటే… టీడీపీతో పొత్తు కోసం ఎక్కవ చర్చ జరగాలని అనుకుంటున్నారా అన్న సందేహం ఎక్కువ మందికి వస్తోంది.