పోలవరం జాతీయ ప్రాజెక్టు అని భాజపా నేతలే చెప్పుకుంటారు. నిధుల విడుదల, రాష్ట్రానికి బిల్లుల చెల్లింపు విషయంలో ఎంత నిర్లక్ష్యం వహించినా… ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి ప్రాజెక్ట్ క్రెడిట్ తమదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా… పోలవరం ప్రాజెక్టు తాము ఇచ్చిందే అని గొప్పగా చెప్పుకున్నారు. పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి, నిర్మాణం పూర్తి చేసి ఉంటే నిజంగానే భాజపాకి ఏపీలో రాజకీయంగా సానుకూలాంశం అయి ఉండేది. జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో కేంద్ర బాధ్యత ఏంటి, దాన్ని ఎంతవరకూ సక్రమంగా నెరవేర్చారు అనేది సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పలేకపోతుంటే… ఇక, జీవీఎల్ ఏం చెప్తారు? అందుకే, మరోసారి తన సహజ ధోరణిలో విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు.
మీడియాతో ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ… సోమవారాన్ని పోలవారంగా చంద్రబాబు మార్చుకోవడమేంటని ఎద్దేవా చేశారు. ప్రతీ సోమవారం తాను ప్రాజెక్ట్ రివ్యూ చేసి ఏదో సాధిస్తున్నాను అన్నట్టుగా సీఎం తీరు ఉంటోందన్నారు. మీరు అనేక రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు వెళ్లడం లేదే, ఇక్కడికే ఎందుకు వెళ్తున్నారు అంటూ జీవీఎల్ ప్రశ్నించారు! సోమవారం పోలవారం అనే కంటే… సొమ్మువారం అనడం కరెక్ట్ అంటూ ఎద్దేవా చేశారు. వారంవారం వెళ్లి సొమ్ము కలెక్ట్ చేసుకున్నారు అనే ఆరోపణలు ముఖ్యమంత్రి మీదా, ప్రభుత్వం మీదా ఉన్నాయన్నారు. ఈ రూ. 1850 కోట్లు ఎవరు మింగారనీ, దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏపీలో పట్టినగతే టీడీపీకి కూడా పడుతుందన్నారు. ఈసారి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. బినామీ పేర్లతో ప్రాజెక్టుల్లో చాలా దోచుకున్నారనీ, దాన్లో చంద్రబాబు వాటా ఎంత అని జీవీఎల్ ఆరోపించారు.
పోలవరం మేమే కట్టిస్తున్నామని ఓపక్క ప్రచారం చేస్తారు, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో కోట్ల అవినీతి జరిగిందని వారే ఆరోపిస్తారు. జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు… ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జీవీఎల్ చెప్తున్నట్టు అంతమొత్తంలో అవినీతి జరుగుతుంటే చూస్తూ ఎందుకు కూర్చున్నారు? ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దింపలేకపోయారా? పోలవరం గురించి మాట్లాడితే ఎప్పుడూ ఆరోపణలే తప్ప… ఒక జాతీయ ప్రాజెక్టుగా దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి మోడీ సర్కారు చేసిన కృషి గురించి జీవీఎల్ మాట్లాడితే కొంతైనా బాగుండేది. ఇలా ఊకదంపుడు ఆరోపణలు చేస్తుండటం వల్ల రాజకీయంగా భాజపాకి ఏపీలో ఏరకంగానే ఉపయోగపడవు కదా!