ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో… హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా మొదలైనా, విపరీతమైన క్రేజ్ తెచ్చుకొంది. ముఖ్యంగా టీజర్‌తో.. ఒక్కసారిగా అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకొంది. ప్రశాంత్ వర్మ సైలెంట్ గా ఏదో ఓ విజువల్ వండర్ క్రియేట్ చేస్తున్నాడన్న ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ప్రశాంత్ వర్మ – తేజా సజ్జా కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు ఈ ట్రైలర్ ఓ నమూనాలా కనిపించింది.
హనుమాన్ మన సూపర్ హీరో కథ. దాన్ని చెప్పడానికి అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించాడు ప్రశాంత్ వర్మ. మన పురాణాల్లో హనుమంతుడి కంటే సూపర్ మాన్ ఎవరుంటారు? అందుకే.. అతని కథని ఎంచుకొన్నాడు. ధర్మాన్ని కాపాడడానికి ప్రతీసారీ దేవుడు ఓ సరికొత్త అవతారం ఎత్తుతూనే ఉంటాడన్న ధర్మసూత్రాన్ని అన్వయించుకొని రాసుకొన్న ఊహాజనిత కథ ఇది. ఓ సామాన్యుడిలో హనుమంతుడు పూనాడంటే… ఇక అతనితో ఎన్ని అద్భుతాలైనా సృష్టించొచ్చు. ఒంటిచేత్తో కొండను ఎత్తొచ్చు. ఎగురుతున్న హెలికాఫ్టర్‌ని ఊడల సహాయంతో ఆపేయొచ్చు. ఇవన్నీ ఈ ట్రైలర్లో కనిపిస్తాయి. హీరో హనుమంతుడి ప్రతిరూపం అన్నప్పుడు ఎవరూ లాజిక్కులు తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి.. దర్శకుడి ఊహని ఫాలో అయిపోవడం పెద్ద కష్టం కాదు. విజువల్స్.. అన్నీ బాగున్నాయి. ఓ సూపర్ మాన్ సినిమా చూడబోతున్నాం అనే భరోసా కల్పించాయి. హీరో ఒక్కడే పవర్ ఫుల్ గా ఉంటే సరిపోదు. విలన్ పాత్ర కూడా పోటా పోటీగా ఉండాలి. అందుకోసం వినయ్ రాయ్‌ని రంగంలోకి దింపాడు. ప్రపంచంలో శక్తినంతా తన చేతుల్లోకి తీసుకోవాలని స్వార్థంతో ఆలోచించే పాత్ర అది. దాన్ని బట్టి.. హీరో – విలన్ పోరు ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. హనుమంతుడు చిరంజీవి అని, ఇప్పటికీ.. హిమాలయాల్లో తపస్సు చేసుకొంటూ ఉంటాడని భక్తుల నమ్మకం. దాన్ని ఆసరాగా చేసుకొని ట్రైలర్ లో ఓ షాట్ కూడా పెట్టారు. విజువల్స్, వెనుక వినిపించే బీజియమ్స్.. ఇవన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. అంజనాద్రి అనే ప్రపంచాన్ని కూడా దర్శకుడు బాగానే డిజైన్ చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర కూడా ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తోంది. మొత్తానికి… హనుమాన్తో ప్రశాంత్ వర్మ ఏదో చేయబోతున్నాడన్న ధీమా టీజర్ ఇస్తే.. ట్రైలర్ దాన్ని రెట్టింపు చేసింది.