చి…..రం……జీ……వి
ఈ పేరు ఓ ప్రభంజనం.
ఈ పేరు ఓ పూనకం.
ఈ పేరు స్వయంకృషికి నిదర్శనం.
తెలుగు సినిమా హీరోకు సరికొత్త జోష్ ఇచ్చిన అద్భుతమైన ప్రయాణం!
మెగాస్టార్ ది అల్టిమేట్ ఎంటర్టైనర్..!
ఎక్కడో ఓ సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఇంతింతై వటుడింతై అన్నట్టు తన ఖ్యాతిని పెంచుకొంటూ టాలీవుడ్‌కి ‘అన్నయ్య’ అయిన వైనం నభూతో…న భవిష్యత్!
గాడ్ ఫాదర్ లేడు. భుజం తట్టి ప్రొత్సహించిన వాడు కనపడలేదు. తన బాట తనదే. తన రూటు తనదే. తన గమ్యం తనదే. తన గెలుపు తనదే.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ శిఖరానికి చేరిన చిరు ప్రయాణం ఆదర్శప్రాయం.
అప్పటి వరకూ టాలీవుడ్ చూసిన హీరోలు వేరు.. చిరంజీవి వేరు. డాన్సుల్లో చిరు మెరుపులా కదిలేవాడు. పాటొస్తే లేచి వెళ్లిపోయే రోజుల్లో థియేటర్లో ఆడియన్స్‌ని కూర్చోబెట్టి… వాళ్లని తన స్టెప్పులతో అరెస్టు చేశాడు. ఫైట్లు సరేసరి. బ్రూస్లీ, జాకీచాన్ లని చూసిన ప్రభావమే ఏమో, తన ఫైట్లకు కొత్త రిథం జోడించాడు. కాస్ట్యూమ్స్‌ని సెలెక్ట్ చేయడంలో… హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో నటించడంలో చిరు స్టైలే వేరు. అదే… చిరంజీవికి టాలీవుడ్లో చెక్కు చెదరని స్థానాన్ని కల్పించింది.
ఖైదీ సినిమా చిరంజీవిని స్టార్‌ని చేసింది. ఓ ఇమేజ్‌ని కట్టబెట్టింది. ఆ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి చూపించిన ప్రతిభ… అతని బంగారు భవితకు బాటగా మార్చింది. కథల్ని ఎంపిక చేసుకోవడంలో చిరు అనతికాలంలోనే ఆరితేరిపోయాడు. వినోదం, యాక్షన్, ఫ్యామిలీ… ఇవన్నీ తన కథల్లో ఉండేట్టు జాగ్రత్తపడ్డాడు. స్టెప్పులా సరేసరి. చిరంజీవి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అతని స్టెప్పులు ఓ కొత్త చరిత్ర సృష్టించాయి. పసివాడి ప్రాణంలో చిరు వేసిన డాన్సులు.. అప్పట్లో ఓ సంచలనం. అప్పటి నుంచి ప్రతీ సినిమాలోనూ సరికొత్త ఒరవడికి నాంది పలికాడు. మాస్, యాక్షన్ కథలకు కేరాఫ్ అడ్రస్స్‌గా నిలిచాడు. ఘరానా మొగుడు వసూళ్లు చూసి బాలీవుడ్ సైతం.. ఆశ్చర్యపోయింది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు దక్కడం సాధ్యమా అని నిర్వెరపోయింది. ఆసమయంలో చిరు పారితోషికం అక్షరాలా కోటి రూపాయలు. ఆ అంకెను అందుకొన్న తొలి దక్షిణాది కథానాయకుడు చిరంజీవినే.
చిరు అంటే మాస్, కమర్షియల్ సినిమాలకే పరిమితం చేయకూడదు. ఓ స్వయంకృషి.. ఓ ఆరాధన..
ఓ ఆపద్భాంధవుడు.. ఓ అభిలాష… రుద్రనేత్ర లాంటి ఫక్తు మాస్ కథల్ని చేసిన చిరు.. రుద్రవీణలాంటి క్లాసిక్ టచ్ ఇచ్చాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవాలన్న ప్రతీ సందర్భంలోనూ అలాంటి కథని ఎంచుకొని తనలోని నటుడ్ని సంతృప్తి పరచుకొన్నాడు. కామెడీ టైమింగ్‌లో చిరుని ప్రత్యేకమైన శైలి. చంటబ్బాయ్, దొంగమొగుడు, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు ఇలాంటి సినిమాల్లో చిరు పండించిన హాస్యం.. అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇంద్ర, ఠాగూర్, శంకర్‌దాదా.. ఇలా చిరు చిత్రాలు సృష్టించిన సంచలనాల గురించి టాలీవుడ్ రికార్డులు ఎప్పుడూ మాట్లాడుకొంటూనే ఉంటాయి.
రాజకీయాల్లో చిరు వైఫల్యం పొందిన మాట అంగీకరించి తీరాలి. కానీ వెండి తెరపై మాత్రం చిరు నేటికీ మెగాస్టారే. చిరు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే టాలీవుడ్ మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. చిరుని మళ్లీ వెండి తెరపై చూసి పులకించి పోవాలని అభిమానులు ఆశ పడుతున్నారు. అందుకు ముహూర్తం కూడా సిద్ధమైంది.
2017 సంక్రాంతికి చిరు 150వ చిత్రం విడుదల కాబోతోంది. అందుకు సంబంధించన ఫస్ట్ లుక్ ఈరోజు హైదరాబాద్‌లో విడుదల కానుంది. ఖైదీతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన చిరు.. ఖైదీ నెం.150తో.. మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడని ఆశిస్తూ… చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.