ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమంటారు.
కానీ.. అందరి విషయంలోనూ అది సాధ్యం కాదు. నెత్తి మీద కిరీటాలున్నప్పుడు భుజాలు వెడల్పు అవుతాయి. అణకువ పోయి అహంకారం తలెత్తే అవకాశాలుంటాయి. ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కీర్తి మెట్లెక్కినా `ఇదేం నావి కావులే` అని సింపుల్ గా ఉండడం – అందరిలా బతికేయడం – అందరి కోసం నిలబడడం కొంతమందికే సాధ్యం. అందులో ప్రభాస్ ఒకడు.
`బాహుబలి లాంటి హిట్ ప్రభాస్ కి కాకుండా మిగిలిన హీరోలకు వస్తే ఎలా ఉండేదో`
– టాలీవుడ్ లో దాదాపు ప్రతీ ఒక్కరి మదిలో ఇలాంటిప్రశ్న మెదిలే ఉంటుంది. పాత్రికేయ ప్రపంచం అయితే… ఈ మాట ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనేఉంటుంది. ఎందుకంటే ఒక్క హిట్ పడగానే – కొంతమంది హీరోల నెత్తిమీద కనిపించని కొమ్ములు కాస్తుంటాయి. ఆటిట్యూడ్ చూపించడం మొదలెడతారు. సూపర్ హిట్ పడితే, బ్లాక్ బ్లస్టర్ వస్తే ఇహచెప్పేదేముంది? `మేమే అంతా` అనుకుంటారు.
కానీ బాహుబలి ఎలాంటి హిట్? మామూలు హిట్టా? దేశమంతా ప్రభాస్ వైపుఆశ్చర్యంగా చూసింది. సాహోరే… ప్రభాస్ అంటూ నినదించింది. మరొకరైతే విర్రవీగిపోతారు. అది సహజం కూడా. కానీ ప్రభాస్ ఆ పొగడ్తల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈశ్వర్ సమయంలో ప్రభాస్ ఎలా ఉన్నాడో? ఇప్పుడూ అలానే కనిపిస్తాడు. అదీ ప్రభాస్.
ప్రభాస్ ఫైట్లు బాగా చేస్తాడనో, డాన్సులు బాగా చేస్తాడనో, డైలాలుగు బాగా చెబుతాడనో, ఆరగడుగుల హీమాన్ లా ఉంటాడనో… అతన్ని ఇష్టపడలేదు. అభిమానించలేదు. ఇన్ని లక్షణాలున్నందుకు కూడా అతను `డార్లింగ్ హీరో` కాదు. అన్నింటికి మించి, అతని సింప్లిసిటీ… తను ఇతరులని ప్రేమించే విధానం – ఇవే తనని డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకునేలా చేశాయి.
ప్రభాస్ దృష్టిలో డైరెక్టరూ డార్లింగే – డ్రైవరూ డార్లింగే. అందరి ముందూ అదే నవ్వు. అదే వినయం. ప్రభాస్ చాలా సిగ్గుపడుతుంటాడు, మొహమాట పడుతుంటాడు అని అందరూ అనుకుంటుంటారు. కానీ కాస్త పరిచయం ఉన్నవాళ్ల దగ్గర ప్రభాస్ ని చూడండి – చిన్న పిల్లాడిలా మారిపోయి అల్లరి చేస్తుంటాడు. తనవాళ్లు అనుకున్న వాళ్ల గురించి ఎంత దూరమైనా వెళ్తాడు ప్రభాస్.
మీడియాతో ప్రభాస్ వ్యవహరించే తీరు చాలా ముచ్చటగా ఉంటుంది. చిన్న పేపరో, పెద్ద ఛానలో అని ప్రభాస్ ఎప్పుడూ చూడడు. ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా – చాలా ప్రేమగా సమాధానం చెబుతుంటాడు. ఏదైనా కాస్త కష్టపెట్టే ప్రశ్న వస్తే మాత్రం `ఎందుకులే డార్లింగ్ మనకు ఇలాంటివి…` అని సున్నితంగా సర్ది చెబుతాడు. ఈ లక్షణాలు పాత్రికేయులకు బాగా నచ్చుతాయి. అందుకే ప్రభాస్ మీద నెగిటీవ్ వార్తలెప్పుడూ రాలేదు. బహుశా.. రావు కూడా.
ప్రభాస్ చేయి చాలాపెద్దది. తన స్నేహితులకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా – ఆపద సంభవించినా, దానికి అడ్డు పడే తొలి వ్యక్తి తనే. తను ఇచ్చే విరాళాలకు అంతే ఉండదు. కరోనా సమయంలో.. అంతకు ముందు భారీగా విరాళాలు ఇచ్చాడు. టాలీవుడ్ హీరోలందరికంటే… ఎక్కువ స్పందించాడు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు. తనపై అభిమానులు కొండంత అంచనాలు, ఆశలు పెంచేసుకున్నారు. టక టచ సినిమాలు చేస్తూ కావల్సినంత సంపాదించేయొచ్చు. కానీ ప్రభాస్ అలా చేయడం లేదు. ఒకొక్క సినిమాకీ రెండు మూడేళ్ల సమయం ఇచ్చేస్తున్నాడు. ఒళ్లు హూనం చేసుకుంటున్నాడు. మూడేళ్ల పాటు కష్టపడి చేసిన సినిమా అటూ ఇటూ అయితే ఎలా ఉంటుందో ప్రభాస్‌కి తెలుసు. కానీ… ది బెస్ట్ ఇవ్వడానికి ప్రభాస్ ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఎందుకంటే.. తన అభిమానుల కోసం. తన డార్లింగుల కోసం. అందుకే ప్రభాస్… అభిమానులకు కూడా డియరెస్ట్ డార్లింగ్ అయిపోయాడు.
హ్యాపీ బర్త్ డే డార్లింగ్..!