ఇటీవల సమంత నటించిన ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అనూహ్యంగా కాంట్రవర్సీలోనూ చిక్కుకొంది. సరోగసీ అవకతవకల నేపథ్యంలో సాగే సినిమా ఇది. సినిమాలో ‘ఈవా’ అనే పేరుతో సరోగసీ ఫెసిలిటీ సెంటర్ చూపించారు. అక్కడ జరిగే అక్రమాలే `యశోద` కథకు మూలం. అయితే నిజంగానే ‘ఈవా’ అనే సరోగసీ ఫెసిలిటీ సెంటర్ ఉంది. దాంతో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకి వెళ్లాయి. యశోద సినిమాలో తమ ప్రతిష్టకు నష్టం కలిగించే సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని, నిర్మాత రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు. ఇప్పుడు ఈ ఇష్యూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొన్నారు నిర్మాత.
‘యశోద’ సినిమాలోని ‘ఈవా’ అనే పేరుని తొలగించామని, ఓటీటీ, శాటిలైట్ లో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు ‘ఈవా’ అనే పేరు కనిపించదని నిర్మాత స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతే కాదు.. ‘ఈవా’ పేరు తొలగించి కొత్త ప్రింటుని కూడా ‘ఈవా’ యాజమాన్యానికి చూపించారు. దాంతో ‘ఈవా’ సంస్థ సంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టులో పిటీషన్ని వెనక్కి తీసుకొంది. అయితే ఏపీ, తెలంగాణలలో కొన్ని చోట్ల ‘యశోద’ సినిమా ఇంకా ప్రదర్శనలో ఉంది. సినిమాలో ‘ఈవా’ పేరు తొలగించడం అంత తేలిక కాదు. దానికి రీ సెన్సార్ జరగాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. థియేటర్ల వరకూ ‘ఈవా’ అనే పేరు తొలగించడం కుదర్లేదు.