హ్యాపీ నెస్ట్ .. అమరావతిలో మొట్ట మొదటి హైరైజ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్. ఏ బడా రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాజెక్టు చేపట్టినా ఎంత హైప్ వచ్చినా బుకింగ్ రోజు మొత్తం కొనేయడం అసాధ్యం. ఇంకా పునాదులు కూడా వేయకుండానే… అమరావతిలో సీఆర్డీఏ కట్టాలనుకున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో ప్లాట్లు గంటలో బుక్ అయిపోయాయి. అదో రికార్డు. అంతగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ హ్యాపీ నెస్ట్ కలగానే ఉంది.
రెరా అప్రూవల్ ఉన్న ఆ ప్రాజెక్టు విషయలో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కొనుగోలు దారులు రెరాను ఆశ్రయించారు. విచారణ జరిపిన రెరా కొనుగోలుదారులకు 16.2%వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఫ్లాట్లను స్వాధీన పరిచేంత వరకూ ఈ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వం … పాలనను ఓ సెటిల్మెంట్ సామ్రాజ్యంగా మార్చింది. ఎంతో కొంత ఇస్తాం.. ప్లాట్లు రద్దు చేసుకోవాలని బేరం పెట్టింది.
నలుగురు, ఐదుగురు తప్ప ఎక్కువ మంది రద్దు చేసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో హ్యాపీ నెస్ట్ ను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. ఐదేళ్లలో నిర్మాణ విలువ రెండు వందల కోట్ల మేర పెరిగింది. అయినా సరే పాత ధరలకే ప్లాట్లు బుకింగ్ చేసుకున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హ్యాపీనెస్ట్ బుకింగ్ చేసుకున్న వారికి రెండేళ్లలో ఫ్లాట్లు చేతికొచ్చే అవకాశం ఉంది.