నడి రోడ్డు మీద ఆ కుటుంబాన్ని నిలిపేసి కారు తీసుకెళ్లిపోయారు. ఆ కష్టాలు పడింది ఆ కుటుంబమే. ఇప్పుడు విచారణ పేరుతో రావాలని ఆ కుటుంబాన్నే వేధిస్తున్నారు. తాము ఎవరికీ ఫిర్యాదు చేయలేదని.. తమ గోడేదో మీడియాకు చెప్పుకున్నామని.. చేతనైతే న్యాయం చేయండి లేకపోతే… మమ్మల్ని అలా వదిలేయండని ఆ కుటుంబం వేడుకునే పరిస్థితిని తీసుకు వచ్చారు. వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కుటుంబాన్ని ఒంగోలు పోలీసులు, ఆర్టీఏ అధికారులు విచారణ పేరుతో వేధించడం ప్రారంభించారు. తమ ఎదుట హాజరు కావాలని ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారు.
నిజానికి అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. సీఎంవోకీ తెలుసు. అప్పటికప్పుడు విచారణ జరిపేసి ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేశామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా విచారణ ఏం జరుపుతారో తెలియదు. నిజానికి వేముల శ్రీనివాస్ ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ మీడియాతో చెప్పారన్న కారణంగా ఆయనపై కక్ష సాధింపుల కోసం ఇప్పుడు విచారణ పేరుతో ఫోన్లు చేసి ఒత్తి డి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీలో వేధింపులకు గురి కావడం వేరు.. అలా అయి కూడా సైలెంట్‌గా ఉండాలి. తమ గోడు ఎవరికైనా చెప్పుకుంటే.. ఆ వేధింపులు రెండో సైడ్ నుంచి కూడా వస్తాయి. దానికి తాజాగా ఉదాహరణ వేముల శ్రీనివాస్. ఇప్పుడా కుటుంబం బిక్కు బిక్కు మంటోంది. అన్యాయానికి గురైన తమను ఎందుకు వేధిస్తున్నామని.. తమను ఇలా బతకనీయాలని వారు వేడుకుంటున్నారు. కానీ ప్రతీకారం తీర్చకునేదాకా వదిలి పెట్టడం గత మూడేళ్లలో ఎప్పుడూ లేదనేది ఎక్కువ మంది చెప్పే మాట.