లోక్ సభ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ పొత్తుల కోసం భాజపా పాకులాడుతున్న తీరు గడచిన కొన్ని రోజులుగా చూస్తున్నాం. మహారాష్ట్రలో శివసేనతో సయోధ్య కుదుర్చుకున్నారు. తమిళనాడులో కూడా అన్నాడీఎంకేతో పొత్తు కుదిరింది. వాస్తవానికి, తమిళనాడులో భాజపాకు సొంతంగా అంటూ ఏమంత కేడర్ లేదు. ఇక, ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఏంటనేదే అసలు ప్రశ్న? ఇక్కడ భాజపాకి రాబోయే ఎన్నికల్లో ఏమాత్రం ఆదరణ లభించదనేది ఎప్పుడో స్పష్టమైపోయింది. అలాగని, ఆంధ్రాని భాజపా వదల్దు కదా! ఎందుకంటే, జాతీయ రాజకీయాల్లో భాజపా వ్యతిరేక కూటమి కట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, వారికి కంటిలో నలుసుగా మారారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఏదో ఒకరకంగా, ఏదో ఒక పార్టీతో పొత్తుకి భాజపా ప్రయత్నించకుండా ఎలా ఉంటుంది?
ఇదే అంశమై విశాఖ ఎంపీ హరిబాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో ఏ పార్టీతో కలవకుండా ఒంటరిగానే భాజపా పోటీ చేస్తుందని అనుకోవడానికి వీల్లేదన్నారు. ఏ పార్టీతో కలిసి ఎన్నికలు ఎదుర్కొంటే విజయం సాధిస్తామనే అంశమై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. తమిళనాడు, మహారాష్ట్రల్లో పొత్తులు కుదుర్చుకున్నట్టుగానే ఆంధ్రా విషయమై కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచించి ఒక నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. ఎన్నికల ముందు పార్టీలు అటూఇటూ అవడం సహజమనీ, ఏ విషయమూ ఇప్పుడే చెప్పలేమన్నారు. మార్చి 1న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారనీ, ఆ సభ తరువాత ఏపీ విషయంలో భాజపా వైఖరి ఏంటనేది స్పష్టమైపోతుందనీ, ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయన్నారు హరిబాబు.
ఆంధ్రాలో పొత్తులు ఉంటాయనేది హరిబాబు వ్యాఖ్యల్లో అంతరార్థం. అయితే, ఆ పొత్తులు ప్రత్యక్షంగా ఉంటాయా, పరోక్షంగా ఉంటాయా అనేదే చర్చ. ఎందుకంటే, టీడీపీని ఓడించడమే భాజపా ముందున్న లక్ష్యం. అలాగని అది భాజపాకి ఒంటరిగా సాధ్యమయ్యే పనికాదు. ప్రతిపక్ష పార్టీలతో కలిసేందుకు భాజపా సిద్ధంగా ఉన్నా… భాజపా సాయాన్ని బహిరంగంగా ఆయా పార్టీలు ప్రకటించుకోలేని పరిస్థితి ఉంది! కాబట్టి, టీడీపీ వ్యతిరేక పార్టీలు, లేదా కూటమికి పరోక్షంగా భాజపా మద్దతు ఇస్తుందనేది వాస్తవం. ఏపీలో భాజపాతో పొత్తు పెట్టుకుంటున్నామని ఏ పార్టీ బహిరంగంగా ప్రకటించలేదనేదీ భాజపాకి తెలిసిన విషయమే. సో.. ఆంధ్రాలో భాజపా పొత్తులుంటాయి, కానీ అవి ప్రజల ముందు ప్రకటించుకునే స్థాయిలో ఉండకపోవచ్చు.