పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ రాజకీయాలు, ఇతర సినిమాల బిజీ వల్ల… ‘వీరమల్లు’కి కావల్సినన్ని డేట్లు కేటాయించలేకపోయాడు. దాంతో ఈ సినిమా పూర్తవుతుందా, మధ్యలోనే ఆగిపోతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ ఈరోజు ‘వీరమల్లు’ టీజర్ విడుదల చేసింది. దాంతో పాటుగా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్న సంకేతాల్ని ఇచ్చింది. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు: స్వార్డ్ వెర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది.
టీజర్లో ‘వీరమల్లు’ వరల్డ్ ని పరిచయం చేశారు. ‘ప్రతివాడ్నీ వాడిపైవాడు దోచుకొంటాడు. మనల్ని దొర దోచుకొంటే దొరని గోల్కొండ నవాబు దోచుకొంటాడు. ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొగల్ చక్రవర్తి. మనపైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు. వాడొచ్చి.. ఈ దొంగలు, దొరల లెక్కలన్నీ సరి చేస్తాడు’ అంటూ వీరమల్లుని పరిచయం చేశారు. వీరమల్లు రాబిన్ హుడ్ లాంటి కథ అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అది ఈ టీజర్ తో స్పష్టమైంది. పవన్ నుంచి డైలాగేం రాకపోవడం ఓ లోటు. కానీ దొంగలు, దొరలు, వాళ్ల లెక్కల్ని సరి చేయడానికి వస్తున్నాడు అనే డైలాగుల వెనుక పొలిటికల్ ఉద్దేశ్యాలూ లేకపోలేదు. ఎలాగూ ఎన్నికల సీజన్ నడుస్తోంది కదా? అందుకే ఈ టీజర్‌ని వదిలినట్టు అనిపిస్తోంది.