విభజన తరువాత చట్టప్రకారం ఆంధ్రాకు రావాల్సినవి ఏంటో…. కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చినవి ఏంటో అందరికీ తెలిసివే. అయితే, ఏపీ భాజపా నేతలు ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే… 85 శాతం విభజన హామీలు అమలు చేసేశామని! మిగిలిన ఆ 15 శాతం కూడా త్వరలోనే అమలు చేసేస్తామని… దాదాపు ఏడాదిగా చెబుతూ వచ్చారు. ఇదే విషయమై ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు హరిబాబు ఏకంగా ఒక పుస్తకాన్ని రాసేశారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రంలోని మోడీ సర్కారు ఏ విధంగా అమలు చేశారో ఆ పుస్తకంలో చెప్పారని, దాన్ని ఇప్పటికీ ప్రస్థావిస్తూ ఉంటారు ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అయితే, ఇవాళ్ల ఢిల్లీలో మీడియాతో హరిబాబు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్థావించారు.
పార్లమెంటుకీ విశాఖ రైల్వేజోన్ కీ సంబంధం లేదన్నారు హరిబాబు. మంత్రి వర్గ నిర్ణయంతోనే ఆ పని జరిగిపోతుందన్నారు! విశాఖ జోన్ అంశం సంబంధిత మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉందన్నారు. రైల్వే జోన్ అంశానికీ బడ్జెట్ కీ కూడా ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే విషయమై తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామనీ, కేంద్రంతో మాట్లాడుతున్నామనీ, తమ ప్రయత్నం ముమ్మరంగా సాగుతోందని హరిబాబు చెప్పుకొచ్చారు. మరి, ఆయన ఇంకా ఎక్కడ ప్రయత్నిస్తున్నారో… సంబంధిత మంత్రిత్వ శాఖ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో వారే చెప్పాలి. నిజానికి, సంక్రాంతి పండుగ ముందు ముగిసిన పార్లమెంటు సమావేశాల్లోనే రైల్వేజోన్ ప్రస్థావన ఉంటుందని భాజపా నేతలే అభిప్రాయపడ్డారు. కానీ, ఆ ఊసే సభలో రాలేదు. దీంతో ఇక ఆ అంశం మరుగునపడ్డట్టే అయింది. గతంలో రైల్వేజోన్ గురించి హరిబాబు మాట్లాడుతూ… విశాఖ జోన్ తెచ్చి తీరతామని ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు, ఆంధ్రాలో బస్సుయాత్రలకు భాజపా సిద్ధమైపోతోంది. విశాఖను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుందీ, ఇక్కడ బాగా ఫోకస్ పెడుతుందీ, కొన్ని వరాలు కురిపిస్తారని భాజపా నేతలు అంటారు. ఆ వరాల సంగతేమోగానీ, విభజన చట్టంలో ఉన్న విశాఖ జోన్ ఇస్తే చాలనే అభిప్రాయం ప్రజలది. కేబినెట్ నిర్ణయంతో జోన్ ప్రకటించొచ్చు అంటున్నారే తప్ప… ఆ నిర్ణయం కేబినెట్ ఎందుకు తీసుకోలేకపోతోందో ఇప్పటికీ ప్రజలకు అర్థం కాని విషయంగా మారింది. దాదాపు మరుగున పడిపోయిందనుకున్న అంశాన్ని మళ్లీ తెరమీదికి తీసుకొచ్చేలా హరిబాబు మాట్లాడారు అంటే… ఏమో, ఎన్నికల వేళ కదా, ఏదైనా కదలిక ఉంటుందేమో చూడాలి.