తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు కుటుంబానికి ప్రాధాన్యత దక్కడం లేదన్న విమర్శ ఎప్పట్నుంచో ఉన్నదే. ఇటీవల విశాఖలో జరిగిన మహానాడులో కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి హరికృష్ణ హాజరు కాలేదు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ ను ఎప్పట్నుంచో పార్టీకి దూరం పెడుతూ వస్తున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలకు జూనియర్ అక్కండి అవుతాడనే ఉద్దేశంతోనే దూరం పెట్టినట్టు చాలామంది చెప్పుకుంటారు. ఇక, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న బాలకృష్ణకు కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యత దక్కడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. హిందూపురంలో క్రియాశీలంగా ఉంటున్న బాలయ్య పీయే శేఖర్ ను తొలగించడం కూడా వ్యూహాత్మకమే అనే విశ్లేషణలు కూడా అప్పట్లో వినిపించాయి. అయితే, ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీలో ప్రాధాన్యత లేదనే అపప్రదకు చెక్ పెట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది!
దీన్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ పదవిని హరికృష్ణకు ఇవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో హరికృష్ణకు అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇదే పదవి కోసం ఈ మధ్య టీడీపీలో పెద్ద చర్చే జరిగింది. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మురళీ మోహన్ కు ఇస్తారంటూ ప్రచారం జరగడంతో… ఆ పదవి తనకే దక్కాలంటూ మరో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కూడా పట్టుబట్టారు! పార్టీని చాలా రకాలుగా ఆదుకున్న తనకే ఆ పదవి ఇవ్వాలంటూ ఆయన చంద్రబాబుపై బాగానే ఒత్తిడి తీసుకొచ్చారట. వీరితోపాటు గాలి ముద్దుకృష్ణమ పేరు కూడా ఓ సందర్భంలో వినిపించింది. కానీ, ఇప్పుడా పేర్లన్నీ పక్కకు వెళ్లి నందమూరి హరికృష్ణను ఫైనల్ చేయబోతున్నారంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బాలకృష్ణ తిరిగి రాగానే ఈ ప్రకటన అధికారంగా ఉంటుందని అంటున్నారు.
నిజానికి, ఈ మధ్య చంద్రబాబుపై హరికృష్ణ బాగా అలకబూని ఉన్నారు. పార్టీ సమావేశాలకు కూడా రావడం లేదు. ఆ మధ్య ఓ సమావేశానికి బలవంతం మీద వచ్చినా… కామ్ గా ఓ మూలన కూర్చున్నారంతే. విశాఖ మహానాడుకు కూడా రాలేదు. ఇప్పుడు టీటీడీ పదవి ఆయనకు ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందనీ, ఆ అపప్రద తొలుగుతుందనీ, అలకలన్నీ తీరిపోతాయనీ చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. ఎలాగూ లోకేష్ మంత్రి అయిపోయారు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో జూనియర్ సేవల్ని మరోసారి వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది కదా!