మియాపూర్ భూకుంభకోణం.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదే అంశమై గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే కేసీఆర్ సర్కారుకు ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, అనుచరులు, సన్నిహితులకు భాగం ఉందని మరోసారి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. అయితే, ఉత్తమ్ వ్యాఖ్యలకి వెంటనే కౌంటర్ ఇచ్చారు తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు.
భూకుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందంటూ ఆరోపించడం కాదు… ఆధారాలు ఉంటే బయటపెట్టాలంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హరీష్ రావు చెప్పారు. ఆడిట్ నివేదికలో వచ్చిన కీలక వివరాలను ఆధారంగా చేసుకుని సీఎం చర్యలు తీసుకుంటున్నారనీ, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారనీ, కొంతమందిపై క్రిమినల్ కేసులు పెట్టారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే ఇప్పుడీ వివాదాలు తలెత్తాయంటూ హరీష్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వమే బయటపెట్టిందనీ, ప్రతిపక్షాలుగానీ మీడియాగానీ ఎవరైనా ఒక్క కొత్త విషయాన్నైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఆధారాలు ఉంటే బయటపెట్టాలనీ, వారి పేర్లను చెప్పాలనీ, లేదంటే అబిడ్స్ సెంటర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ముక్కును నేలకు రాయాలంటూ సవాల్ చేశారు. ఈ స్కామ్ లో ఉన్నవారి జాతకాలూ వివరాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయనీ, వాటిని బయటపెడతామంటూ హరీష్ చెప్పడం విశేషం.
సరే.. హరీష్ ఛాలెంజ్ వినడానికి బాగానే ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఆయన కౌంటర్ ఇచ్చి… టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించకపోవడం విశేషం! టీడీపీ నేతలు కూడా ఇదే కుంభకోణంపై తీవ్రంగానే స్పందిస్తున్నారు కదా. గవర్నర్ ను కలిసి వారూ వినతి పత్రం ఇచ్చారు. అంతేకాదు.. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నారంటూ ఓ ప్రముఖుడి కారు నంబరు, ఫోన్ నంబర్ ను కూడా రేవంత్ రెడ్డి ఈ మధ్యనే బయటపెట్టారు. ఆ పెద్దమనిషి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మరి, అవి వాస్తవాలో కావో కూడా హరీష్ రావు చెప్పి ఉంటే బాగుండేది. హరీష్ చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆరోపిస్తున్నదేమీ లేదు. కొత్తగా వారు బయటపెట్టిన వివరాలూ లేవు. అందుకే, ఇంత ఈజీగా హరీష్ రావు కౌంటర్ ఇచ్చేశారు. వివరాలుంటే బయటపెట్టాలని కూడా సవాల్ విసిరారు. మరి, దీనిపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.