బీఆర్ఎస్ లో అంతర్గత పోరు షురూ అయ్యిందా? అంటే గత కొద్ది రోజులుగా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా..బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు కనీస మద్దతు లేకపోవడం ఈ ప్రచారానికి దారితీస్తోంది.
రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సభలో మాట్లాడుతూ..హరీష్ రావు రాజీనామా చేయాలని, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా హరీష్ పట్ల రేవంత్ వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు.
పైగా, బీఆర్ఎస్ లో హరీష్ కోటరీగా ముద్రపడిన నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించలేదు. దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీషే ఆలస్యంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జరుగుతోన్న ఈ వరుస పరిణామాలతో బీఆర్ఎస్ లో అంతర్గత పోరు నడుస్తోందన్న టాక్ ప్రారంభమైంది.
పైగా.. రేవంత్ కూడా కేటీఆర్ ను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం హరీష్ రావుపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగా కేటీఆర్ పెద్దగా చర్చలో లేకుండా పోతున్నారు..దీంతో బీఆర్ఎస్ లో ప్రత్యామ్నయంగా హరీష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. వీటిని అంచనా వేసే హరీష్ రావుపై సీఎం, మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు కేటీఆర్ సాహసించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.