ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై క్రెడిట్ పంచాయితీ మరింత ముదిరింది. ప్రాజెక్టు ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తైన నేపథ్యంలో… ప్రాజెక్టును జాతికి అంకితం చేసే ముందు మంత్రులు వరుసగా ప్రాజెక్టును సందర్శించారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి.
మంత్రులంతా క్రెడిట్ కోసం వెళ్తున్నారని… ఆగస్టు 15వ తేదీన సీఎం కూడా వెళ్తున్నారని హరీష్ రావు విమర్శించగా, మంత్రి తుమ్మల తీవ్రంగా స్పందించారు.
తాను ఏనాడు క్రెడిట్ కోసం పాకులాడలేదని… ప్రజల కోసం తపనపడ్డానంటూ మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. తాను ఎన్నో ప్రాజెక్టుల్లో భాగం పంచుకున్నానని, ఖమ్మం జిల్లా రైతాంగానికి సీతారామ ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని ఏళ్లుగా తపనపడ్డట్లు స్పష్టం చేశారు.
సీతారామా ప్రాజెక్టు క్రెడిట్ ఎవరికి దక్కాలి?
నిజానికి సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వమే మొదలుపెట్టినా ఇది రీడిజైన్ చేసిన ప్రాజెక్టు. ఇదే ప్రాజెక్టును గతంలో దమ్ముగూడెం ప్రాజెక్టుగా పిలిచేవారు. వైఎస్ హయం నుండి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ హయంలో రీడిజైన్ చేసి… సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఆనాడు ఖమ్మం జిల్లా మంత్రిగా ఇది నా కల అంటూ తుమ్మల కూడా భూమిపూజలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా, ఖమ్మం జిల్లా నుండి ఆయనే మంత్రిగా ఉన్నారు.