చిరంజీవి తో సినిమా చేయాలని అందరి డైరెక్టర్స్ కి వుంటుంది. కొంతమందికి ఆ అవకాశం అనూహ్యంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చిరుతో విశ్వంభర చేస్తున్న వశిష్టకి కూడా ఇలానే వచ్చింది. బింబిసార సక్సెస్ తో ఒక్కసరి మెగా డైరెక్టర్ అయిపోయాడు వశిష్ట. మరికొందరు మాత్రం ఎప్పటినుంచి ప్రయత్నిస్తున్నా.. ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపొతుంటుంది. ఈ జాబితాలో హరీష్ శంకర్ వున్నారు. ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా చేయాలని కథపై వర్క్ చేస్తున్నారు హరీష్. చిరుకి కూడా హరీష్ అంటే ఇష్టం. పవన్ తో హరీష్ చేసిన గబ్బర్ సింగ్ చిరు ఫేవరేట్ మూవీ. అలాంటి సినిమా నాకు పడితే బావుండేదని చాలాసార్లు తనతో మనసులో మాట చెప్పారు చిరు.
హరీష్ కూడా చిరుకి ఓ కథని సెట్ చేసే పనిలో వున్నాడు. అయితే లేటెస్ట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ రిజల్ట్ చూసిన తర్వాత ఇప్పట్లో ఇంక కష్టమనే కామెంట్స్ వినిపించాయి. అయితే హరీష్ మాత్రం ‘చిరు’ పై ఆశలు పెట్టుకున్నాడు. ” చిరంజీవి గారితో ఎప్పుడు కలిసినా.. మా కాంబినేషన్లో సినిమా గురించే మాట్లాడుకుంటాం. ఇటీవల ఆయనతో చేసిన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చింది. ఆయనకు బాగా నచ్చింది. నన్నెంతో మెచ్చుకున్నారు. నేను విధిని నమ్ముతా. గబ్బర్‌సింగ్‌ను నేను ఎంచుకోలేదు. అదే నన్ను ఎంచుకుంది. సమయం వచ్చినప్పుడు ఇది కూడా జరుగుతుంది’ అంటూ తన నమ్మకాన్ని తెలియజేశాడు. మొత్తానికి హరీష్ అయితే మెగా ఆశలు ఒదులుకోలేదు. పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ కొడితే చిరుతో సినిమా మెటీరియలైజ్ అయ్యే ఛాన్స్ అయితే వుంది.