సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాతో రాబోతున్నాడు. సేహరి సినిమా తీసిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు వచ్చాయి కానీ కథ రివిల్ చేయలేదు. తాజాగా వదిలిన ట్రైలర్ హరోం హర మూలకథని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం 1980 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. హీరో సుధీర్ బాబు తుపాకులు తయారూ చేస్తుంటాడు. మొదట చేతి ఖర్చులకి చేసినా.. తర్వాత దాన్ని ఒక సామ్రాజ్యంగా విస్తరిస్తాడు. అప్పుడు తనకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? ఎలాంటి శత్రువులు తయారయ్యారనేది మిగతా కథ.
‘బలవంతుడుకి ఆయుధం అవసరం అయితే బలహీనుడుకి ఆయుధమే బలం’ ని సునీల్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగింది. తుపాకుల తయారీ, వాటికి పేరు పెట్టడం, కొత్త శత్రువులు పుట్టుకురావడం, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సుదీర్ బాబు కుప్పం యాసలో పలికిన డైలాగులు..ఇవన్నీ కొత్త అనుభూతిని పంచేలానే వున్నాయి. సుదీర్ బాబుకి సునీల్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కీలకంగా వున్నాయి. నేపధ్య సంగీతం గ్రిప్పింగ్ గానే వుంది. ఇందులో సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం చట్టూ ఎదో డివైన్ ఎలిమెంట్ కూడా వుంది. ట్రైలర్ లో అది సస్పెన్స్ గానే పెట్టారు. మొత్తానికి సినిమాపై బజ్ క్రియేట్ చేసేలా వుంది ట్రైలర్. జూన్ 14న సినిమా విడుదల కానుంది.