లవ్, సెక్స్, ధోఖా… రొమాంటిక్ థ్రిల్లర్స్ దాదాపు ఈ మూడు ఎలిమెంట్స్ చుట్టూనే తిరుగుతాయి. తాప్సీ లీడ్ రోల్ లో చేసిన ‘హసీన్ దిల్రూబా’ పాయింట్ కూడా ఇదే. పాండమిక్ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో బజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమాకి పార్ట్ 2 ‘ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా’ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైయింది. మరి ఈ సెకండ్ పార్ట్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమిటి? ప్రేమ కోసమై వలలో చిక్కిందెవరు? భార్య, భర్త మధ్యలో వచ్చిన కొత్త ప్రేమికుడి కథ ఏమిటి?
హసీన్ దిల్రూబా ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే… రాణి(తాప్సీ), రిషు(విక్రాంత్ మాస్సే) పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. అయితే వీరి వైవాహిక బంధం సజావుగా సాగదు. రిషికి తమ్ముడు వరసైన నీల్ (హర్షవర్ధన్ రాణే)కి మానసికంగా, శారీరకంగా దగ్గరౌతుంది రాణి. అయితే తొందర్లోనే నీల్ నిజస్వరూపం తెలుసుకుంటుంది. రాణి పర్శనల్ వీడియోలని వాడుకొని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తాడు నీల్. దీంతో రాణి, రిషు కలసి నీల్ ని ఓ పథకం ప్రకారం హత్య చేస్తారు. ఈ పథకంలో భాగంగా రిషు చనిపోయాడని లోకానికి నమ్మిస్తారు. ఇక్కడికి ఆగింది పార్ట్ 1.
తాను చనిపోయాని లోకానికి నమ్మించిన రిషు, అప్పుడప్పుడు దొంగచాటుగా వచ్చి రాణిని కలుస్తుంటాడు. రాణితో కలసి థాయ్ లాండ్ వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అంతా సజావుగా సాగుందనే సమయంలో మోంటూ (జిమ్మీ షెర్గిల్) ఆగ్రా పోలీస్ స్టేషనుకు స్పెషల్ ఆఫీసర్ గా వస్తాడు. చనిపోయిన నీల్ ఇతని మేనల్లుడే. నీల్ ని చంపి డ్రామా ఆడుతున్నది రిషి, రాణి అని బలంగా నమ్ముతాడు మోంటూ. అది నిరూపించడానికి సరైన ఆధారాలు సేకరించే పనిలో ఉంటాడు. పోలీసులకు అనుమానం రావడంతో తాను సరెండర్ అయిపోతాని భావిస్తాడు రిషు. అయితే రాణి ఓ పథకం వేస్తుంది. పోలీసుల ద్రుష్టి మరల్చడానికి అభిమన్యు (సన్నీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. ఇంతకీ ఈ అభిమన్యు ఎవరు? రాణి ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా? అభిమన్యు రాకతో రాణి, రిషుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది ఈ సెకండ్ పార్ట్ కథ.
ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ అంటారు. అయితే ఆ తాజ్ మహల్ ని ఆనుకునే యమునా నది ప్రవహిస్తుంది. ఆ నదిని ఒక ఎలిమెంట్ గా చేసుకుని రచయిత్రి కనికా ధిల్లాన్ రాసిన క్రేజీ లవ్ థ్రిల్లర్ ఇది. భర్త తనని చంపాలని చూస్తున్నాడని రాణి పోలీసులని ఆశ్రయించిన సన్నివేశంతో కథ మొదలౌతుంది. అయితే ఫస్ట్ పార్ట్ చూడనివారికి ఆ సెటప్ అంతా గందరగోళంగా వుండే అవకాశం వుంది. కథ తెలిసివారికి మాత్రం వాట్ నెక్స్ట్అనే ఆసక్తి ఏర్పడుతుంది.
సెకండ్ పార్ట్ లో అభిమన్యు పాత్ర కొత్త యాడ్ ఆన్. బిగినింగ్ లో పాత్ర అంత ఆసక్తిగా వుండదు. పెళ్లి తంతు కూడా హడావిడిగా తేల్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ ముందుకు జరుగుతున్న కొద్ది అభిమన్యు బ్యాక్ స్టొరీ, క్యారెక్టర్ లేయర్స్ ఆక్తికరంగా వుంటాయి. అసలు తను ఏం అలోచిస్తున్నాడో, తనకి ఏం కావాలో ఒక మిస్టరీ ఎలిమెంట్ లా డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
హసీన్ దిల్రూబా కథలో మరో మెయిన్ క్యారెక్టర్ దినేష్ పండిట్ నవలలు. రాణికి ఆయన రాసిన నవలలు అంటే పిచ్చి. ఫస్ట్ పార్ట్ లో అలాంటి ఓ నవల ఆధారంగానే రాణి, రిషు డెత్ డ్రామా ప్లే చేస్తారు. సెకండ్ పార్ట్ కి ముగింపు కూడా దినేష్ పండిట్ నవల ఆధారంనే వుంటుంది. యుమున నదిలో ‘మొసలి వల’ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సన్నివేశాలు, చివరి పదిహేను నిమిషాల్లో మలుపులు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
అయితే ఇందులో లోపాలు లేకపోలేదు. విచారణ జరిపే పోలీసులు పాత్రలు చాలా బలహీనంగా వుంటాయి. సిసి పుటేజ్ లో ఆధారాలు చూడటం తప్పితే చేసిందేమి లేదు. రైల్వే బ్రిడ్జ్ దగ్గర సీన్ లో పోలీసులు చేతులు కట్టుకొని చోధ్యం చూసిన తీరు నవ్విస్తుంది. అలాంటి సీన్స్ ని ఇంకాస్త పకడ్బందీగా తీయాల్సింది. చివర్లో వచ్చే ట్విస్ట్ లు బావున్నప్పటికీ రొటీన్ లూప్ ఫీలింగ్ ని కలిగిస్తాయి.
రాణి పాత్రలో తాప్సీ మరోసారి ఒదిగిపోయింది. విక్రాంత్ సహజంగా కనిపించాడు. సన్నీ కౌశల్ నటన మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. చాలా లేయర్స్ వున్న క్యారెక్టర్ అది. ఈ ముగ్గురి నటన ఆధారంగా సినిమా ఇంకాస్త ఎంగేజింగ్ గా కనిపించింది. టెక్నికల్ గా సినిమా బావుంది. అన్నీ రియల్ లోకేషన్స్ లో తీశారు. విజువల్స్, మ్యూజిక్ క్యాలిటీగా వున్నాయి. డైరెక్టర్ జయప్రద్ దేశాయ్ ఫస్ట్ హాఫ్ ని గ్రిప్పింగ్ చూపించల్సింది. రైటర్ కనికా ఇంకాస్త లాజికల్ గా రాయాల్సింది. లాజిక్స్ ఆలోచిస్తూ చూస్తే ఈ సినిమా కిక్ ఇవ్వకపోవచ్చు. కానీ హసీన్ దిల్రూబా నచ్చిన ఆడియన్స్ ఓ లుక్కేయోచ్చు.