ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం కారణంగా టిఆర్ఎస్ పార్టీ కి జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. తెలంగాణ సాధించాడు అన్న అభిమానంతో గత ఐదేళ్ల పాటు కేసీఆర్ ని నెత్తిమీద పెట్టుకున్న తెలంగాణ ప్రజలు, ఇప్పుడు నెమ్మదిగా మౌనముద్ర వీడుతున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే, గత నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా జనాలు చేస్తున్న విమర్శలు విపరీతంగా పెరిగిపోయాయి.
గత ఐదేళ్లలో తెలంగాణ లో కెసిఆర్ పాలనలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సెంటిమెంట్ కారణంగా వాటన్నింటిని భరించి, కెసిఆర్ ని సమర్థించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు కెసిఆర్ మీద విమర్శల జోరు పెంచు తున్నారు. గత ఐదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కరెంటు విషయంలోనూ, రోడ్ల విషయంలోనూ, చెరువుల విషయంలోనూ అభివృద్ధి ఉన్నా, అక్షరాస్యత వంటి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పలు నివేదికలు గతంలోనే పేర్కొన్నాయి. అయితే ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్పందించిన తీరు మీద సంతృప్తిగా లేనటువంటి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ పాలనలో ఎదుర్కున్న వైఫల్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. 29 రాష్ట్రాలు మరియు ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 36 ప్రాంతాలకు గత ఏడాది తీసుకున్న నివేదికలో తెలంగాణ ప్రభుత్వం అక్షరాస్యత విషయంలో 35 వ స్థానంలో ఉండడం గమనార్హం. చివరి స్థానంలో అంటే 36వ స్థానంలో బీహార్ ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని మళ్లీ హైలెట్ చేస్తూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పురోగతి ఇదేనా అంటూ, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ నెటిజనులు విరుచుకుపడుతున్నారు. పైగా తెలంగాణలో దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో అక్షరాస్యత శాతం సగటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. పైగా, స్త్రీ పురుషుల మధ్య దాదాపు 10 శాతం దాకా అక్షరాస్యతలో వ్యత్యాసం ఉండడం కూడా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది.
ఏది ఏమైనా గత ఐదు సంవత్సరాల తో పోలిస్తే , ఇంటర్మీడియట్ బోర్డు సంఘటన తర్వాత కెసిఆర్ మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా పెరిగినట్టు అనిపిస్తోంది. కెసిఆర్ పాలనలో వైఫల్యాలను మీడియా ప్రశ్నించ లేక పోవడంతో, సోషల్ మీడియాలో మరింత చురుగ్గా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఉండడం చూస్తుంటే రాబోయే కాలంలో కేసీఆర్కు సోషల్ మీడియా తలనొప్పిగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. అయితే అప్పటికే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయి ఉండడం టిఆర్ఎస్ కి కలిసొచ్చే అంశం.