ఉన్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి టీవీ ప్రధాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా 44 మందికి హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై… అసభ్య పోస్టులను వీరందరూ పెట్టినట్లు… ఆధారాలతో సహా న్యాయస్థానం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు అందాయి. నోటీసులు అందుకున్న వారిలో కొమ్మినేనితో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అనే మరో జర్నలిస్టుకి.. పంచ్ ప్రభాకర్ అనే అమెరికా లో ఉండే వైసీపీ అభిమానికి కూడా నోటీసులు వెళ్లాయి. ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పలువురిపై సీఐడి కేసులు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించింది.
కొమ్మినేని శ్రీనివాసరావు సుమన్ టీవీ అనే యూ ట్యూబ్ చానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చి..న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి కొమ్మినేని సాక్షి టీవీలోనే చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఎన్నో సార్లు.. వైసీపీకి మద్దతుగా.. ఆ చర్చా కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు. వైసీపీ మద్దతుదారుని తరహాలో ప్యానెల్లో కూర్చున్నవారితో వాదులాటకు దిగారు. అయితే.. న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే విషయంలో మాత్రం ఆయన సాక్షిలో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో కాకుండా.. సుమన్ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చి మరీ…అలాంటి ప్రకటనలు చేశారు. ఆ వీడియో క్లిప్‌లతో హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అలాగే పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే వ్యక్తికి నోటీసులు వెళ్లాయి. ఈయన అమెరికాలో ఉన్నప్పటికీ.. వైసీపీ లాంగ్వేజ్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. అసభ్యమైన మాటలు.. బూతులతో తన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ వర్కవుట్ అయిందని అనుకున్నారేమో కానీ అదే ఫ్లోలో కోర్టును కూడా అసభ్యంగా దూషించారు. ఆ క్లిప్ లుకూడా వైరల్ అవడంతో.. హైకోర్టు నోటీసులకు దారి తీసింది. ప్రసాదర్ రెడ్డి అనే మరో జర్నలిస్టు కూడా నోటీసులు అందుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ మెయిల్‌కు పెద్ద ఎత్తున న్యాయమూర్తులపై నిందలు వేసినవాళ్లు..తప్పుడు ప్రచారం చేసిన పోస్టుల వివరాలతో ఫిర్యాదులు వెళ్తున్నాయి.