ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గుండెకు సమస్య వచ్చింది. గుండె నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లుగా గుర్తించడంతో అర్జంట్‌గా చికిత్స చేయించుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. మూడు రోజుల కిందట తగ్గకుండా జ్వరం వస్తూండటంతో ఆయన విశాఖలో టెస్టులు చేయించుకున్నారు. చివరికి అది గుండె సమస్య కారణంగా వచ్చినట్లుగా గుర్తించి వెంటనే అడ్మిట్ అయితే.. స్టంట్ వేయాలా లేకపోతే ఆపరేషన్ చేయాలా అన్నది నిర్ధారిస్తామన్నారు. కానీ బొత్స అర్జంట్ పనులు ఉన్నాయని చెప్పి జాయిన్ కాలేదు.
మేనకోడలి పెళ్లి ఉన్న కారణంగా.. ఆ పెళ్లి అయ్యాక ఆపరేషన్ చేయించుకుంటానని ఆయన చెప్పి వచ్చారు. కానీ కుటుంబసభ్యులు పెళ్లి కన్నా చికిత్స ముఖ్యమని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆయన కుమారుడు సందీప్.. హుటాహుటిన బొత్సను హైదరాబాద్ తీసుకు వెళ్లి .. గుండె చికిత్సలకు ప్రసిద్ధి చెందిన ఆస్పత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బొత్సను అబ్జర్వేషన్ లో ఉంచి అన్నిరకాల పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలను బట్టి ఆయనకు ఆపరేషన్ చేయాలా.. స్టంట్స్ వేయాలా అన్నది నిర్ణయించుకునే అవకాశం ఉంది.
ఏపీలో అత్యున్నత స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయని.. ప్రభుత్వానికి చెందిన వారు కూడా అక్కడే చికిత్స చేసుకుంటారని చెబుతూంటారు కానీ.. కరోనా దగ్గర్నుంచి కిడ్నీలో రాళ్ల వరకూ.. ఏ సమస్య వచ్చినా వైసీపీ నేతలు, మంత్రులు హైదరాబాద్ పయనమవుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఖర్చుల బిల్లంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అందుకే ఏపీ లో కంటే.. హైదరాబాద్ లో చికిత్సకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.