హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఒకే చోట కుంభవృష్టిగా వర్షం పడే ప్రమాదం ఉందని బిగ్ అలర్ట్ ఇచ్చింది.
భారీ వర్షాల నేపథ్యంలో 40కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, హోర్డింగ్ ల కింద ఉండవద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నగర ప్రజలు తీవ్ర అవస్థలకు గురైయ్యారు. తాజాగా శనివారం భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే, సరిగ్గా ఉద్యోగులు ఇంటికి వెళ్ళే సమయం కావడంతో వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గమ్య స్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.