పువ్వులున్న చెట్టు అందంగా వుంటుంది. కానీ చెట్టు మొత్తం పువ్వులే అయితే..? సినిమాలో ఎలివేషన్స్ కూడా అంతే. పాత్ర, సందర్భానికి తగ్గట్టు ఎలివేషన్ వుంటే చూడటానికి ఆసక్తికరంగా వుంటుంది. అంతేకానీ చిటికీమాటికీ ఎలివేషన్ ఇచ్చుకుంటూ పొతే ఒక దశలో చిరాకు పుడుతుంది. సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఓవర్ ఎలివేషన్స్ కి పరాకాష్టగా మారాయి.
వీరసింహాలో బాలకృష్ణ కనిపించిన దాదాపు అన్ని సీన్స్ లో ఒక ఎలివేషన్ వుంటుంది. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే చెప్పనవసరం లేదు. వీర సింహ ఆడుపెడితే .. భూమి కంపించడం, వాటర్ గ్లాస్ షేక్ అవ్వడం, ఒక్క తన్నుకి లాండ్ రోవర్ లాంటి భారీ కారు గాల్లోకి లేచిపోవడం.. ఇవన్నీ రిలీజ్ రోజు ప్రిమియర్ చూసే అభిమానులు ఆ పూటకు నచ్చుతాయో కానీ.. తర్వాత వాళ్ళు కూడా నవ్వుకుంటారు. గతంలో సైగ చేస్తే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ గురించి బాలకృష్ణ రిగ్రేట్ ఫీలియ్యారు. ”చేసినప్పుడు బావుంది కానీ.. చూసినపుడు నాకే నవ్వొచ్చింది”అన్నారొకసారి. కానీ దర్శకుడు గోపిచంద్ మలినేని తగ్గలేదు. ఒక పూనకం పట్టినట్లు తీసుకుంటూ వెళ్లారు.
వాల్తేరు వీరయ్య ఏమీ తక్కువ కాదు. అవసరం వున్న లేకపోయినా వీరయ్య పాత్రని భారీ ఎలివేషన్ తో అడుగడుగునా ఎలివేట్ చేసుకుంటూపోయాడు బాబీ. సముద్రంలో డిజైన్ చేసిన యాక్షన్ సీన్ గ్రాఫిక్స్ అని తెలుస్తుంటుంది. అంతకుముందు వీరయ్య పేరు చెబితేనే అందరూ వణికిపోవడం, నావీ వాళ్ళే సముద్రం లో స్మగ్లర్ లను పట్టుకోలేక వీరయ్య సాయం కోరడం, హెలీకాప్టార్ ని జంప్ చేసి అందుకోవడం.. ప్రతి ఫైట్ ముందు స్లో మోషన్ షాట్లని అటు ఇటు తిప్పి చూపించడం.. సడన్ గా సీన్ లోకి ఒక ఏనుగుని తీసుకొచ్చి కారుని తొక్కించడం .. లాజిక్ కి అందని ఎలివేషన్లే.
కమర్షియల్ సినిమాలో ఎలివేషన్లు ఉండాల్సిందే. అందులోనూ మాస్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్లు ఎలివేట్ కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఎలివేషన్ క్రియేట్ చేయడంలో కూడా ఒక పద్దతి, టెక్నిక్ వుంటుంది. రాజమౌళి సినిమాల్లో భీవత్సమైన ఎలివేషన్స్ వుంటాయి. అయితే అవి ఎబెట్టుగా ఉండవు. ఎలివేషన్ ఇవ్వడానికి ముందు ఆయన క్రియేట్ చేసే మూడ్ చక్కగా, సహజంగా కుదురుతుంది. బాహుబలిలో ఏనుగు తొండాన్ని బాణంలా చేస్తాడు ప్రభాస్. ఇది ఎవరికీ ఎబెట్టుగా అనిపించదు. ఎందుకంటే అది రాజుల నాటి కథ. ఆ సీన్ లో ఏనుగు వుండటం, యుద్ధనైపుణ్యాలు ప్రదర్శించడం సహజంగానే అనిపిస్తుంది.
వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. మలేసియాలోని సుప్రసిద్ధ కుమారస్వామి టెంపుల్ లో జాతర జరుగుతుంటుంది. అక్కడ ఏనుగులు వుండటం సహజం. హీరో ఏనుగుఎక్కి శత్రు సంహారం చేయాలనేది మంచి కమర్షియల్ ఆలోచనే. ఐతే ఇక్కడే రాజమౌళికి మిగతా దర్శకులకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సీన్ లోకి ఏనుగుని తీసుకురావడానికి ముందు ప్రేక్షకులని ప్రిపేర్ చేయడంలో రాజమౌళి నైపుణ్యం వేరుగా వుంటుంది. అంతకుముందు ఒక్కసారి కూడా ఏనుగుని చూపించకుండా సడన్ గా సీన్ లోకి తీసుకొచ్చే పని రాజమౌళి నుంచి జరగనుగాక జరగదు. కథానాయకుడు ఎలాగో మలేషియా వెళ్ళాడు కాబట్టి.. అంతకుముందు ఆ గుడికి వెళ్లి అతను దండం పెట్టుకోవడం, ఏనుగు తొండంతో అతడికి ఆశీర్వాదం ఇవ్వడం (పంక్తు కమర్షియల్ సినిమాల్లో ఏనుగులు హీరోలని ఈ టైపులోనే ఆశీర్వదిస్తుంటాయి) లాంటి ఒక మాంటేజ్ షాట్ అయినా తీస్తారు. అలా ఆ ఏనుగుతో ఒక ఎమోషనల్ కనెక్షన్ వుంటే.. ఆ ఎలివేషన్ సన్నివేశం ఇంకా పక్కాగా వుండేది.
అఖండ ఎఫెక్ట్ తో గోపిచంద్ మలినేని వీరసింహా ఎలివేషన్స్ డిజైన్ చేసినట్లు స్పష్టంగా అర్ధమౌతుంది. అఖండ ఎలివేషన్స్ మాములుగా వుండవు. అయితే ఈ విషయంలో బోయపాటి తెలివిని మెచ్చుకోవాలి. అఖండ పాత్రని దైవాంశ సంభూతుడైన అఘోరగా మలిచాడు బోయపాటి. అందుకే తెరపై ఎంత విద్వంసం జరుగుతున్నా.. ప్రేక్షకులకు ఎక్కడా ఓవర్ యాక్షన్ అనిపించలేదు. ఈ పాత్రకి ఏదైనా సాధ్యమనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. అందుకే రధచక్రాలని గాల్లో ఎగరేసినా ఎవరూ ఆక్షేపించలేదు. కానీ వీరసింహాలో తున్నుతో కారుని గాల్లో లేపడం ట్రోల్స్ కి అవకాశం ఇచ్చింది.
ఎలివేషన్స్ డిజైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఎలివేషన్ లో ఎమోషన్ వుంటేనే అది కనెక్టింగ్ గా వుంటుంది. ఊరికే ఇస్తే మాత్రం అవి కేవలం బిల్డప్ షాట్లు గానే మిగిలిపోతాయి. మాస్ డైరెక్టర్లు ఈ విషయంలో శ్రద్ధ, జాగ్రత్త తీసుకువాల్సిన అవసరంఎంతైనా వుంది. దీనికి కోసం ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. కళ్ళముందే రాజమౌళి కనిపిస్తున్నారు. ఆయన సినిమాల్లో ఎలివేషన్స్ పరిశీలిస్తే.. చాలా విషయాలు నేర్చుకోవచ్చు.