పాటలు, పోరాటాలూ.. ఇవి లేని తెలుగు సినిమాని ఊహించుకోవడం కష్టం. కమర్షియల్ హంగులు అనే పదానికి ఇవి రెండూ నిలువుటద్దాలు. ఓ మినిమం రేంజున్న హీరో .. పాటలూ లేకుండా, ఫైట్లు చేయకుండా ఓ సినిమా చేస్తే.. అది ప్రయోగం, సాహసం అయిపోతుంటుంది. అలాంటిది అగ్ర హీరోలు ఈ రెండింటికీ దూరంగా ఉండగలరా..? ముఖ్యంగా ఫైట్లు. అవే కదా.. మాస్ కి కిక్కు,.
అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. హీరోలు ఫైట్సంటే భయపడిపోతున్నారు. దానికి కారణం కరోనా. సామాజిక దూరం పాటిస్తూ, షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడే అనుమతులు ఇచ్చినా, హీరోలు సెట్లోకి అడుగుపెట్టే ధైర్యం చేయలేదు. ఇప్పుడిప్పుడూ.. వాళ్లంతా కదిలి రావడంతో షూటింగులకు కళ వచ్చింది. అయితే,.. చాలామంది హీరోలు ఫైట్స్ అంటే భయపడిపోతున్నార్ట. దానికి కారణం. సామాజిక దూరం పాటించే వీలు కుదరకపోవడమే. పాటంటే సోలో.. డ్యూయెట్స్ తో లాగించేయొచ్చు. కానీ ఫైటంటే .. కనీసం 20- 30 మంది ఫైటర్లు ఉండాల్సిందే. ఈమధ్య వందలాది మంది ఫైటర్లతో హీరోలు ఢీ కొట్టుకునే ఫైట్లు చూస్తున్నాం. అంతకు తగ్గితే.. ఫైట్లే ఆనడం లేదు. అయితే కరోనా నేపథ్యంలో ఇంతమంది ఫైటర్లతో డీల్ చేయడం కష్టమే. సో…. కొంతకాలం పోరాట సన్నివేశాలకు దూరంగా ఉండాలని హీరోలు భావిస్తున్నార్ట. ఇటీవల ఓ హీరో సినిమాలో భారీ ఫైట్ కోసం ప్లాన్ చేస్తే… సదరు హీరో `ఫైట్స్ ఇప్పుడొద్దు.. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. ఆఖర్లో చూసుకుందాం. అప్పటికీ కరోనా కంట్రోల్ లోకి వస్తేనే` అని చెప్పేశాడట. మరో హీరో అయితే… క్లైమాక్స్ లో ఫైట్ తీసేసి, కథని సుఖాంతం చేసేయమని చెప్పాడట. దాని కోసం స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ చేయాల్సివచ్చిందని టాక్.
పెద్ద హీరోల మాట అటుంచితే.. యువ హీరోలు సైతం ఫైట్లకు సిద్ధంగా లేరని సమాచారం. ఇక కాదూ.. కూడదన్న పక్షంలో విలన్ తో సోలోగా ఢీ కొట్టేలా స్క్రిప్టు మార్చమంటున్నారట. పాటల్లోనూ ఇప్పుడు డాన్సర్లు గుంపులు గుంపులుగా కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి కరోనా వల్ల… జూనియర్ డాన్సర్లకూ, ఫైటర్లకు కూడా పనులు లేకుండా పోయాయి.