ఓ స్టార్ హీరో ఆడియో ఫంక్షన్లో మరో స్టార్ హీరో కనిపిస్తే కనులకు పండగే. అలాంటి దృశ్యం భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆవిష్కృతమైంది. అటు మహేష్ బాబు, ఇటు ఎన్టీఆర్.. ఇద్దరు హీరోల్ని పక్క పక్కన చూడ్డానికి రెండు కళ్లూ సరిపోలేదు. ఈ సంప్రదాయం ఇలానే కొనసాగాలని కోరుకుంటోంది చిత్రసీమ. మహేష్ బాబు కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మహేష్ మాట్లాడుతూ ‘ ఆది ఆడియో ఫంక్షన్‌కి నేను వెళ్లాను. ఇప్పుడు నా సినిమా వేడుకకు ఎన్టీఆర్ వచ్చాడు. ఇక ప్రతి ఫంక్షన్ ట్రెండ్ మారుతుంది. అందరు హీరోలు ఒకరి ఫంక్షన్‌కి మరొకరు వెళ్తారు. చిత్రసీమలో స్టార్ హీరోలు తక్కువ. తిప్పి కొడితే యేడాదికి ఒక్క సినిమా చేస్తాం. అన్ని సినిమాలు బాగా ఆడాలి. మేము-మేమూ బాగానే ఉంటాం. మీరే బాగుండాలి’ అని అభిమానులకు హితవు పలికాడు మహేష్‌బాబు.
ఈ సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ ” శివ కథ చెప్పినప్పుడు సీఎం అనే సరికి భయం వేసింది. ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను. సినిమా షూటింగ్లో చాలా నేర్చుకున్నా. ‘శ్రీమంతుడు’ నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. మళ్లీ ఈ సినిమాతో ఇంకో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనల కన్నా మించింది ఏముంటుంది? ఆ రోజు సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది” అన్నాడు మహేష్.