పార్లమెంట్ సెషన్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఎవరంటే.. ముగ్గురు మహిళా ఎంపీలే .. టాప్ త్రీలో ఉంటారు. ప్రధాని మోడీ అటు.. లోక్‌సభలోనూ.. ఇటు రాజ్యసభలోనూ మాట్లాడినా… అది హైలెట్ కాదు. కానీ.. మోడీకి యాంటీగా.. మాట్లాడిన.. ముగ్గురు మహిళా ఎంపీలు మాత్రం సూపర్ పాపులర్ అయ్యారు. ఆ ముగ్గురూ కూడా.. మొదటి సారి.. లోక్‌సభలో అడుగుపెట్టిన వాళ్లే కావడం.. అసలు విశేషం. ఇందులో.. ఓ తెలుగు సినిమా హీరోయిన్ కూడా ఉంది.
ఫైర్ బ్రాండ్ ఆఫ్ ది వీక్ మహువా..!
ఈ లోక్‌సభకు గతం కంటే అత్యధిక మంది మహిళలు ఎన్నికయ్యారు. వీళ్లంతా ఇప్పుడు హాజరుకోసం వచ్చే సభ్యులు కాదు..! లోక్‌సభలో ప్రశ్నించడం తమ విధి అని భావించే నాయకులు. అందుకే ఏ నాయకుడు ఎత్తి చూపని, లేవనెత్తని అంశాలను అడిగేస్తున్నారు. పాలకులను కడిగేస్తున్నారు. వీళ్ల ధైర్యం చూసి మిగతా ఎంపీలు కూడా అవాక్కవుతున్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా మోదీ సర్కార్‌ను ఈ స్థాయిలో కడిగిపారేసింది లేదు. కేవలం 10 నిమిషాల్లో ఏడు అంశాలను చక్కగా వివరిస్తూనే.. బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు.., మహువా అనే ఎంపీ. ఈమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. పార్లమెంట్లో ఆమె ప్రసంగం… వైరల్ అయిపోయింది. నిరంకుశత్వం ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అనుకుందే రైట్.. కాదనుకుంది తప్పు అని మెజార్టీ ప్రజలు ఇతరులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ఇది ఫాసిజం ఆనవాళ్లేనని తేల్చి చెప్పారు. నడిరోడ్డుపై మూక హత్యలు జరుగుతున్నాయి… మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతోందంటూ అసలేం జరుగుతుందో తేటతెల్లం చేశారు. ఈ ప్రసంగానికి ఇప్పుడు ఇతర పక్షాల నుంచే కాదు… ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. మహువాది గొప్ప స్పీచ్ అంటూ అంతర్జాతీయ మీడియా కొనియాడింది.
నవనీత్ కౌర్ కూడా చప్పట్లు కొట్టించేసుకుంది..!
తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికై.. ప్రసంగంలో తనదైన ఘాటు చూపించిన మరో సభ్యురాలు నవ్‌నీత్ కౌర్ రానా..! తెలుగు సినీ ప్రేక్షకులకు నవ్‌నీత్ కౌర్‌గా పరిచయం. గతంలో తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న నవ్‌నీత్ కౌర్… పెళ్లి తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానాను వివాహం చేసుకున్న నవ్‌నీత్ కౌర్… మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇక్కడ శివసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. దేశం మొత్తం మోదీ హవా ఉంటే.. ఇండిపెండెంట్‌గా నవ్‌నీత్ రానా గెలవడమంటే మాటలు కాదు..! సబ్జెక్ట్‌లోనూ నవ్‌నీత్ కౌర్ బ్యూటిఫుల్. ఏ అంశంపైనైనా ఆకట్టుకునేలా ప్రసంగించగలరు. ముఖ్యంగా అమరావతి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెబుతారు. అందుకే తన తొలి ప్రసంగంలోనే లోక్‌సభలో డైనమైట్లా పేలారు. అమరావతి నియోజకవర్గంలో ఏయే సమస్యలు ఉన్నాయి..! కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. ఇప్పుడు నవ్‌నీత్ కౌర్ స్పీచ్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
తిరుగుబాటుకు రూపం నుస్రత్ జహాన్…!
నుస్రత్ జహాన్… ఈవిడ బెంగాళీ హీరోయినే..! బసిర్హాత్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన నుస్రత్ జహాన్‌కు రాజకీయంపై అవగాహన ఉంది. అంతేకాదు.. ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఈమె స్టయిల్..! ఇలా ఈ ఇద్దరు కొత్త ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. అందంతోనే కాదు… విషయ పరిజ్ఞానంలోనూ తాము సూపర్ అని చెబుతున్నారు. తన ఆహార్యంపై వచ్చిన విమర్శలకు సూటిగా సమాధానమిచ్చారు. మోరల్ పోలీసింగ్ చేసే వారికి… సరైన షాక్ ఇచ్చారు. గెలిపించిన వారి కోసం ప్రశ్నించడం మా హక్కు అని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు విపక్షాలకు ఫైర్ బ్రాండ్లు ఓ ఆయుధంగా మారుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎదురొడ్డి నిలుస్తున్నారు.