తెలుగు360 రేటింగ్ : 2.75/5
ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కొకుండా చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు నాని. అలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి కూడా ముందుంటాడు. నాని గత చిత్రం ‘దసరా’ పూర్తి మాస్ సినిమా. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా సున్నితమైన భావోద్వేగాలతో రొమాంటిక్ లవ్ స్టొరీగా ‘హాయ్ నాన్న’ తెరకెక్కించారు. ఈ చిత్రంతో కూడా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. ప్రచార చిత్రాలు ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అనేబ భరోసా కల్పించాయి. నాని కూడా సినిమాని చాలా నమ్మకంగా ప్రమోట్ చేశాడు. ‘గురువారం సినిమా విడుదల చేస్తున్నాం కాబట్టి శుక్రవారం నుంచి టికెట్లు దొరకవ్’ అనే స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. మరి నానికి అంత నమ్మకాన్ని ఇచ్చిన హాయ్ నాన్న కంటెంట్ ఏమిటి? నాని నమ్మకం నిలబడిందా? హాయ్ నాన్నలోని భావోద్వేగాలు ప్రేక్షకులని హత్తుకున్నాయా?
విరాజ్ (నాని) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. తనకు ఆరేళ్ళ కూతురు మహి( బేబీ కీయరా). విరాజ్ సింగిల్ పేరెంట్. మహికి సిస్టో ఫైబ్రోసిస్ అనే కండీషన్ వుంటుంది. తను ఇంకెంతో కాలం బతకదని వైద్యులు చెబుతారు. తన ఆరోగ్యం మెరుగవ్వాలంటే లంగ్ మార్పిడి జరగాలి. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు విరాజ్. మహికి ఇవన్నీ తెలీవు. తనదెప్పుడూ ఒకటే బాధ. తన అమ్మ గురించి చెప్పమని. పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే అమ్మ కథ చెబుతానని మహికి ప్రామిస్ చేస్తాడు విరాజ్. తాను ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నప్పటికీ అమ్మకథ చెప్పకుండా దాటవేస్తాడు. దీంతో అలిగిన మహి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిన మహికి అనుకోకుండా యష్ణ( మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. మహి కోసం కంగారు పడుతున్న విరాజ్ కి ఫోన్ చేస్తుంది యష్ణ. ముగ్గురూ ఓ కాఫీ షాప్ లో కలుస్తారు. అయితే అమ్మ గురించి చెబితేనే వస్తానని మారాం చేస్తుంది మహి. దీంతో యష్ణ ఎదురుగానే తన గతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు విరాజ్. అయితే చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా తల్లిని చూడని మహి.. అమ్మగా ఎవరిని ఊహించుకోవాలని అడుగుతుంది. తనని వూహించుకోమని చెబుతుంది యష్ణ. అలా తన గతంలో వర్షా (మహి ఊహలో మృణాల్)తో జరిగిన ప్రేమ పెళ్లి కథ చెబుతాడు. అయితే వర్షా, విరాజ్ ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు విరాజ్ ఒంటరయ్యాడు? విరాజ్ కథని విన్న యష్ణలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి? మహి జబ్బు నయం అయ్యిందా? ఇదంతా తెరపై చూడాలి.
‘హాయ్ నాన్న’ కథ రెండు కోణాల్లో సాగుతుంది. ఒకటి తండ్రీకూతుళ్ళ కథ, మరొకటి ప్రేమకథ. ఈ రెండూ బలమైన ఎమోషన్స్. నాని ఈ రెండు తరహ సినిమాలు చేశాడు. జెర్సీలో తండ్రి కొడుకుల కథ కనిపిస్తుంది. ఇక ప్రేమకథల విషయానికి వస్తే పెద్ద జాబితానే వుంది. కానీ ఈ రెండూ వున్న కథగా హాయ్ నాన్న కనిపిస్తుంది. ఐతే ఉండటానికి రెండు లేయర్లు వున్నాయి కానీ.. అవి బలంగా ఉన్నాయా? కొత్తదనం చుపించగలిగాయా? అనేదే అసలు పాయింట్. హాయ్ నాన్న పాయింట్ విషయానికి వస్తే.. సింగిల్ పేరెంట్ అనగానే సంతోషం, కుచ్ కుచ్ హోతాయే సినిమాలు గుర్తుకు వచ్చేస్తాయి. ఈసింగిల్ పేరెంట్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇందులో పాయింట్ చూస్తున్నపుడు అప్పుడెప్పుడో రాజశేఖర్ చేసిన మా ఆయన బంగారం, కమల్ హాసన్ వసంతకోకిల సినిమాలు గిర్రున మైండ్ లో తిరుగుతాయి. హాయ్ నాన్నలో కనిపించే షాకింగ్ ఎలిమెంట్ ఈ చిత్రాలకు మరో వైపులా అనిపిస్తాయి.
నిజానికి ఇది యష్ణ కథ. ఆ పాత్ర కోణంలో ఈ కథని చెప్పుంటే మరింత బలంగా వుండేది.. కానీ తండ్రీ కూతుర్ల బాండింగ్ ని చూపిస్తూ కథని నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్‌లో ప్రేమకథలో కొత్తదనం లేదు. ఇందులో ప్రధాన సంఘర్షణ ప్రేమకథ అనుకున్నపుడు.. ఆ ప్రేమ కథని బలంగా తీర్చిదిదాల్సింది. కానీ అది రొటీన్ వ్యవహారం అయిపోయింది. ఇందులో ముఖ్యమైనది యష్ణ పాత్ర. ఆ పాత్ర స్వభావంతో కథ మలుపుతిరుగుతుంది. అయితే ఆ పాత్రని సమర్ధవంతంగా చూపించలేకపోయారు. తను పెళ్లి చేసుకోవడానికి, అయిష్టాన్ని పెంచుకోవడానికి, దూరం కావడానికి బలమైన కారణాలు లేవు. దీంతో తెరపై చూపించిన ఎమోషన్ అంతా లైట్ అయిపోయింది. హోటెల్లో బిల్ కట్టే సీన్ మాత్రం ప్రేమకథలో చెప్పుకునేలా వుంటుంది. అక్కడ దర్శకుడి పనితనం కనిపిస్తుంది. విరామం సమయంలో ట్విస్ట్ ఆసక్తికరంగానే వుంటుంది. కథకి ఓ కొత్త తళుకు అద్దిన ట్విస్ట్ ఇది.
విరామ సన్నివేశానికి మంచి మలుపు కుదిరింది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే ఇందులో సన్నివేశాలు ఊహకు అందిపోతుంటాయి. విరాజ్ పాత్రకు ఒక నిజం తెలుసు. ఆ నిజం, మహి, యష్ణ పాత్రలకు తెలిసిందా లేదా? అనే కోణంలో ఇక్కడ ఆసక్తికరమైన డ్రామా క్రియేట్ కావాలి. ఆ డ్రామాని మాత్రం బలం గా పండించాడు దర్శకుడు. గోవా లో నడిపిన డ్రామా కథకు అనవసరపు సాగదీత అనిపించినా.. కథని అక్కడే ముగించడం, పాత్రలన్నింటిని పాజిటీవ్ యాంగిల్ లోకి మార్చడం తో.. ఈ కథకు ఒక నిండు తనం వచ్చింది. ఈ కథకు ప్రధాన బలం ఎమోషన్. మహి యష్ణని వెదుక్కుంటూ వెళ్ళినప్పుడు.. ‘’నాన్న ప్రేమ సరిపోవడం లేదా’’ అని బాధపడతాడు నాని. ఈ సినిమా తో ఎమోషన్ గా కనెక్ట్ ఐన వాళ్లకు ఇదే ఈ కధలో హై మూమెంట్.
తండ్రి పాత్రలు నానికి కొత్త కాదు. విరాజ్ పాత్రని చాలా సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఈ పాత్ర గ్రాఫ్ మాత్రం ఒకటే సీరియస్ టోన్ లో వుంటుంది. నిజానికి నాని ఏ పాత్ర చేసిన అందులో తెలియని ఒక హుషారు వుంటుంది. అది ఆశించే అభిమానులకు కాస్త నిరాశ ఎదురవుతుంది. మృణాల్ కి నటనకు ఆస్కారం వుండే పూర్తి నిడివి వున్న పాత్ర దక్కింది. కొన్ని సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. బేబీ కియారా క్యూట్ గా వుంది. తన నటన కూడా సహజంగా ఉంది. జయరామ్ పాత్రకు కు ఓ ట్విస్ట్ వుంది. శ్రుతిహాసన్ కేవలం ఓ పాటకే పరిమితమైంది. ప్రియదర్శితో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి
హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ‘సమయమా’ పాట బాగా కుదిరింది. దాన్నే ఎక్కువగా బీజీఎంలో వాడారు. అమ్మాడి పాట కూడా బావుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా చేశాడు. షాను జాన్ వర్గీస్ ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది. ఓ మామూలు ప్రేమకథకు తండ్రీకూతురు ఎమోషన్ జోడించాలని ప్రయత్నించాడు దర్శకుడు. కొన్ని చోట్ల తన ప్రతిభని కనబరిచాడు. ఓ మామూలు ప్రేమకథని తండ్రీ కూతుర్ల కోణంలో నడపడంతో.. కొత్తదనం అబ్బింది. కొన్ని చిక్కుముళ్లని కావాలనే వేసుకొన్న దర్శకుడు వాటి సాయంతో కథనాన్ని కాస్త రక్తికట్టించాడు. ఆఖరికి కుక్క పాత్రని సైతం కథలోని మలుపులా వాడుకోవడం బాగుంది. నాని ఉన్నాడు కదా అని తన కోసం ఇది వరకటి సినిమాల్ని గుర్తు చేసేలా హుషారైన సన్నివేశాలు రాకుండా, ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగానే కథని నడిపించాడు. తొలిసగంలో సాగదీత, ద్వితీయార్థంలో అనవసరపు హై డ్రామా కాస్త ఇబ్బంది పెట్టినా.. క్లైమాక్స్ తో మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని టచ్ చేశాడు. మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ ఏం లేవు. కాకపోతే.. క్లాస్‌కి ఈ ఎమోషన్ పట్టొచ్చు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఓ మంచి మెలోడ్రామా చూసే ఛాన్స్ ఇచ్చాడు ఈ నాన్న.
తెలుగు360 రేటింగ్ : 2.75/5