కౌంటింగ్ రోజున ఏపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజున చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. మారణాయుధాలు, నాటుబాంబుల కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరి ఇళ్లలోనైనా మారణాయుధాలు ఉంటే ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. హిస్టరీ షీట్స్ ఉన్న వారిని స్టేషన్ కు పిలిచి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని కౌంటింగ్ రోజున దూరంగా ఉంచాలని లేదంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లోకి ఎవరు వస్తున్నారు..? ఎవరు వెళ్తున్నారు..? వారు ఎవరితో టచ్ లో ఉంటున్నారు..? అనే విషయాలను పోలీసులు గుర్తిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోకి వస్తోన్న అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో 301ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి 4వేలకు మందికిపైగా గుర్తించి , పలువురిని అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలిసు సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. కౌంటింగ్ ముగిసిన మరో 15 రోజులపాటు అందరూ విధుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. అలాగే వచ్చే నెలాఖరు వరకు కేంద్ర బలగాలను కూడా ఏపీలోనే ఉంచనున్నారు. నూతన ప్రభుత్వం కొలువుదీరి పరిస్థితులు సర్డుకున్నాకే కేంద్ర బలగాలు రాష్ట్రం నుంచి వెళ్లనున్నాయి.