కేసీఆర్‌ను గుక్కతిప్పుకోనీయకుండా చేసేందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఆయనపై ఎన్నికల బరిలో నిలబెట్టాలని నిర్ణయించుకుంది. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ కూడా కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి నుంచి ఇప్పటికే షబ్బీర్ అలీ ప్రచారం ప్రారంభించారు. ఆయన స్థానిక నియోజకవర్గం కావడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. షబ్బీర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. గజ్వేల్ నుంచి కెసిఆర్‌పై ఈటల రాజేందర్ బిజెపి తరపున పోటీ చేస్తున్నారు.
కామారెడ్డిలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో గంప గోవర్ధన్ కేవలం ఐదు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ఓట్లతోనే గంప గోవర్ధన్ బయటపడ్డారు. ఈ సారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. పరిస్థితి వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా సర్వేలు చేయించిందని అంటున్నారు. షబ్బీర్ అలీ అక్కడ్నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ కేసీఆర్ కు ఆయన సరి తూగరని.. రేవంత్ రెడ్డి అయితే కరెక్టన్న అంచనాలు రావడంలో సమగ్ర అధ్యయన చేసి ఈ మేరకు… పోటీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
కొడంగల్‌లో ఈ సారి రేవంత్ రెడ్డి ప్రచారం చేయకపోయినా గెలుస్తారని.. కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడిస్తే తెలంగాణలో తిరుగులేని నేత అవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.కామారెడ్డిలో తాను గెలిచినా.. గజ్వేల్ లో ఉంటానని.. గజ్వేల్ ను వదిలి పెట్టబోనని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇది కూడా అక్కడి ఓటర్లపై ప్రభావం చూపిస్తందని అనుకుంటున్నారు. రేవంత్ పోటీ ఫైనల్ అయితే… అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో కేసీఆర్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమని అనుకోవచ్చు.