ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారి మూక దాడులకు పాల్పడటం, ప్రతిపక్ష పార్టీల నేతలను కిడ్నాప్ చేయడం, కొట్టడం, చట్టాలను ఉల్లంఘించడం వంటివి యథేచ్చగా చేస్తున్నారు. హైకోర్టు అదే పనిగా చీవాట్లు పెడుతూనే ఉంది. రూల్ ఆఫ్ లా అమలు చేయరా అని ప్రశ్నిస్తూనే ఉంది. కానీ ఘనత వహించిన డీజీపీ గౌతం సవాంగ్ గారి పర్యవేక్షణలో పోలీసులు అలా దూసుకెళ్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న పోలీసులు టీడీపీ నేతల అక్రమ అరెస్టులో పోలీసులపై మూడు సార్లు మండిపడింది. ఇది పోలీసుల గౌరవానికే తీవ్ర అవమానకరం. చట్టాలను పాటించాల్సిన పోలీసులు పూర్తిగా ఓ పార్టీకి అనుబంధ సంస్థగా మారి ఇతరులను వేధించడం .. కోర్టు మొదట్టికాయలు తినడం అంటే.. ఖచ్చితంగా వారు విధుల్లో విఫలమైనట్లే.
మొదట పట్టాభి అరెస్ట్ విషయంలో పోలీసులు చేసిన తప్పుల్ని హైకోర్టు న్యాయమూర్తి బయటపెడితే పోలీసులకు సమర్థించుకోవడానికి మాటలు రాలేదు. ఆ తరవాత టీడీపీ నేత బ్రహ్మం చౌదరిని అరెస్ట్ చేసిన రోజంతా పోలీస్ స్టేషన్లు తిప్పి కొట్టి.. ఆ తర్వాత అరెస్ట్ చూపించారు . దీనిపైనా హైకోర్టు మండిపడింది. కొట్టడం ఏమిటని పోలీసుల్ని ప్రశ్నించింది. సోమవారం బెయిల్పై విచారణ సాగనుంది. మరో వైపు హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ పల్నాడులో దియ్యా రామకృష్ణ అనే టీడీపీ నేతను అరెస్ట్ చేయడంపై అక్కడి పోలీసు అధికారులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అదే నిజం అయితే.. వారిపై తీవ్ర చర్యలు ఖాయమని స్పష్టం చేసింది.
ఇవన్నీ ఇలా జరుగుతూండగానే చిత్తూరు జిల్లా టీడీపీ నేతలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బెంగళూరు నుంచితీసుకొచ్చి.. చిత్తూరు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లుగా షో చేశారు. కుటుంబసభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. పరిస్థితి చూశారేమో కానీ రాత్రే బెయిల్ ఇచ్చారు. ఇంత దారుణమైన పోలిసింగ్తో పాటు కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా.., పోలీసులకు ఏ మాత్రం కనువిప్పు కలగడం లేదు. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా.. తుడుచుకుని పోతున్నారు. కొసమెరుపేమిటంటే.. టీడీపీ నేతలపై మాత్రం రోజూ ఓ ప్రకటన చేస్తూంటారు..పోలీసుల సంఘం ప్రతినిధులు. వైసీపీకి అనుబంధ సంస్థ అనే దాన్ని అలా నిరూపిస్తూంటారు కావొచ్చనేది ఎక్కువ మంది వారి తీరుతో వచ్చే అనుమానం.