మంగళగిరి ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి వరస కేసులతో పదునైన వాదనలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో మంచి పట్టు సాధించారు. గతంలో భూసమీకరణ కేసుల్లోనూ,స్విస్ చాలెంజి విషయంలోనూ, ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలుగు దేశం పార్టీని రాజకీయంగా కంగారు పెట్టారు. ఈ పరంపరంలో భాగంగా ఇప్పుడు సదావర్తిభూముల విషయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలకమైన తీర్పు రావడానికి కారకులైనారు. చెన్నైలోని సదావర్తి భూముల విలువ వెయ్యికోట్లకు పైగా వుంటుందనీ, కాని ప్రభుత్వం ఎకరా 28లక్షల చొప్పున కారుచౌకగా తన వారికి కట్టబెట్టిందని ఆయన వాదన. మొదట ఆ సమస్యే లేదన్న రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఒప్పుకుని తామే కాపాడమన్నట్టు మాట్లాడింది. అనేక ఆపసోపాలు పడింది. గతంలో ఈ కేసులో న్యాయస్థానం ఇప్పుడు 22 కోట్లకు ఆ భూములు అమ్ముడు పోయాయి గనక మరో అయిదుకోట్లు అదనంగా మీరిస్తే మీకే భూములు చెందుతాయని ఆర్కేకు ఆఫర్ ఇచ్చింది, ఈ వాయిదాలో ఆయన అందుకు అంగీకరించారు.అయితే డబ్బులు ఎక్కడివనే ప్రశ్న రాకుండా తాను కొందరు స్తోమత గల వ్యాపారవేత్తలతో మాట్లాడానని వారు తీసుకుంటారని జాగ్రత్తగా చెబుతున్నారు. వాస్తవం ఏంటే ఆర్కేది పెద్ద వ్యాపార కుటుంబం. రామ్కీ అయోధ్య రామిరెడ్డి ఆయన సోదరుడే. కనుక ఈ మొత్తం సర్దుబాటు చేయడం తనకు పెద్ద సమస్య కాదు. అయితే అంతకంటే ముఖ్యమైంది ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ భూముల భవిష్యత్తు ఏం చేస్తుంది? ఆర్కేకు అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. తర్వాత జరిగేదేమిటన్నది ఒకటైతే ఇప్పటికి మాత్రం వైసీపీ ఎంఎల్ఎ పై చేయి సాధించి ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పడేశారు. ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ భూములను దర్మాదాయ భూములను కాపాడ్డం అవసరం.